● మధ్యాహ్నం వరకు విద్యార్థుల
ఎదురుచూపులు
● ప్రభుత్వ చర్యలతో నలుగురే మిగిలారు
చిట్టమూరు: మండల పరిధిలోని ఆరూరు పంచాయతీ తంబుగారిపాళెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నాలుగు రోజులుగా ఉపాధ్యాయుడు రాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు ఉండి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా ఉపాధ్యాయుడు రాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం పాఠశాలలోనే ఉండి మధ్యాహ్న భోజనం చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ విద్యాసంవ్సతరం నుంచి తమ గ్రామంలోని పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేకపోవడంతో డిప్యుటేషన్‌పై వచ్చిన వారు సక్రమంగా హాజరు కావడం లేదన్నారు. అదేమని అడిగితే బదిలీపై ఉపాధ్యాయులు వెళ్లడంతో రోజుకో ఉపాధ్యాయుడు వస్తున్నాడన్నారు. మరీ దారుణంగా వారం రోజులు నుంచి బడికి పిల్లలు వెళ్లి మధ్యాహ్నం వరకు బడిలోనే ఉండి భోజనం చేసుకుని ఏమీ చేయలేక ఇంటికి వచ్చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగతా పిల్లలు ఇతర పాఠశాలల్లో చేర్పించుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో
25 మందికిపైగా విద్యార్థులు
గత ప్రభుత్వ హయాం వరకు ఇక్కడి పాఠశాలలో సుమారు 25 మందికి పైగా విద్యార్థులు చదువుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను గాలికి వదిలేయడంతో ఇక్కడ కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే మిగిలారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు కూడా ఇతర పాఠశాలలకు పంపే వసతి లేక ఇక్కడికి పంపుతున్నారు. దీనిపై ఎంఈఓ బీవీ కృష్ణయ్యను వివరణ కోరగా ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉందన్నారు. అసలు ఉపాధ్యాయుల్లేని పాఠశాలలకు సీఆర్పీలను పంపుతున్నామన్నారు. ఈ క్రమంలోనే తంబుగారిపాళెం పాఠశాలకు సీఆర్పీని పంపామన్నారు. ఎందుకు పాఠశాలకు వెళ్లలేదో తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.
ఉపాధ్యాయుడు రాకపోవడంతో ఖాళీగా కూర్చుని ఉన్న విద్యార్థులు
ఉపాధ్యాయుడు రాకపోవడంతో పాఠశాల గదిలో ఖాళీగా ఉన్న కుర్చీ
కూటమి ప్రభుత్వ చర్యలతో ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. శాశ్వత
ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడంతో జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల
సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని తంబుగారిపాళెం ప్రాథమిక పాఠశాలకు నాలుగు రోజులుగా ఉపాధ్యాయుడు డుమ్మా కొడుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు.


