నెల్లూరు(వీఆర్సీసెంటర్): బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1వ తేదీన సీపీఐ ఆధ్వర్వంలో ‘మార్పు అవసరం’ పేరుతో చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం పోస్టర్లను ఆవిష్కరించారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టాక దేశంలో నిరాశ, ఆందోళనలు నెలకొన్నాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని, ఆర్థిక అసమానతలు విస్తరించడంతో పాటు సామాజిక ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయన్నారు. చివరకు నీట్ లాంటి జాతీయ స్థాయి పేపర్లు లీక్ కావడం సిగ్గుచేటన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు, 17వ తేదీ నుంచి 28 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు దామా అంకయ్య, నందిపోగు రమణయ్య, మధు, సిరాజ్, మున్నా, షాన్‌వాజ్, సోఫియా, జిలానీఖాన్, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


