– గంగమిట్ట అంగన్‌వాడీ కార్యకర్త నిర్వాకం
వింజమూరు (ఉదయగిరి): విధులకు డుమ్మా కొట్టి.. చిన్నారులను గాలికి వదిలేసిన ఓ అంగన్‌వాడీ కార్యకర్త కొద్ది రోజులుగా టీడీపీ ఇంటింటి ప్రచారంలో నిమగ్నమైన వైనం వింజమూరులోని పాతూరు గంగమిట్టలో జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గంగమిట్ట అంగన్‌వాడీ కేంద్రంలో భాగ్యమ్మ కార్యకర్తగా పని చేస్తోంది. అయితే ఆమె ఇటీవల టీడీపీ ముఖ్య నేత తన బంధువని చెప్పుకుంటూ ఉద్యోగులు, అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆమైపె చర్యలు తీసుకునేందుకు సంబంధిత ఐసీడీఎస్ అధికారులు సాహసించకపోవడంతో బహిరంగంగానే ఆమె టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరులో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగ్యమ్మ పాల్గొనడంపై స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విధులకు హాజరు కాకుండా.. టీడీపీ ప్రచారంలో పాల్గొనడం ఏమిటని నిలదీశారు. ఈ విషయమై సీడీపీఓ పద్మజాకుమారిని వివరణ కోరగా.. వేరే ఊర్లో ఉన్నందున మధ్యాహ్నం వరకు విధులకు రాలేనని పర్మిషన్ కోరగా అనుమతించామని, కానీ ఆమె రోజంతా రాకుండా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫిర్యాదులొచ్చాయన్నారు. దీనిపై విచారించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని చెప్పారు.


