హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

కోట: స్థానిక నార్త్‌ గిరిజన కాలనీలో సుధా అనే మహిళపై గురువారం రాత్రి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. నిందితుడు శివప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్‌కుమార్‌ శనివారం తెలిపారు. కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో చికిత్స పొందుతోంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని ఎస్సై తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌

ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

మర్రిపాడు: ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్‌ ఢీకొన్న ఘటన మండల పరిధిలోని జిల్లా సరిహద్దు సమీపంలో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి బద్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో ఓ వ్యక్తి మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీధిదీపాల నిర్వహణలో అలసత్వం వద్దు

తిరుపతి రూరల్‌: ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వీధిదీపాల నిర్వహణలో అలసత్వం వీడాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. తొమ్మిది జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వీధిదీపాల విద్యుత్‌ సర్వీసులు 13,568, పంచాయతీల పరిధిలో 41,918 సర్వీసులు ఉన్నాయన్నారు. వీధిదీపాల నిర్వహణకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో నిర్వహణా లోపం కారణంగా పగటిపూట వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్‌ వృథా అవుతోందన్నారు. వీధిదీపాల నిర్వహణ పూర్తిగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఉన్నప్పటికీ విద్యుత్‌ శాఖ సిబ్బంది సమన్వయంతో సమస్యను అధిగమించాలన్నారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నృసింహునికి గరుడసేవ

గూడూరు: గూడూరు రూరల్‌ పరిధి కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం గరుడసేవ వైభవంగా జరిగింది. పౌర్ణమి అనంతరం శనివారం కావడంతో తొలుత సుదర్శన యాగం చేపట్టారు. అమ్మవారికి విశేషాలంకరణ గావించారు. అలాగే ఆలయంలో సుదర్శన, నరసింహ యాగం చేపట్టి వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి గావించారు. భక్తులు భారీగా తరలివచ్చి గరుడసేవను తిలకించారు.

పొదలకూరు

నిమ్మధరలు(కిలో)

పెద్దవి: రూ.65

సన్నవి: రూ.30

పండ్లు: రూ.15

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement