● ఫీడ్ ధరలు తగ్గించే
వ్యవహారంలోనూ కుట్రలు
● ఉప్పల శంకరయ్య గౌడ్
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వంలో ఆక్వారంగం కుదేలైందని వైఎస్సార్‌సీపీ తోటపల్లిగూడూరు మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సిండికేట్ యాజమాన్యాలకు, దళారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆక్వా రంగానికి అన్ని విధాలా సహకారం అందించిందన్నారు. నేడు ఫీడ్ రేట్లు విపరీతంగా పెరగడం, మరోవైపు మార్కెట్‌లో రొయ్యల ధరలు పూర్తిగా పడిపోవడంతో రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారన్నారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ప్రతి ఎకరాకు విద్యుత్ సబ్సిడీ పూర్తిగా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పటి వరకు ఒక్క కొత్త సబ్సిడీ కనెక్షన్ కూడా ఇవ్వలేదన్నారు. దీంతో వేసవి కాలంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. ఫీడ్ రేట్లు పెరగడం, గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు నేడు ‘క్రాప్ హాలిడే’ ప్రకటించే దిశగా ఆలోచన చేస్తున్నారన్నారు. అందుకే గత నెల 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రొయ్యలను పట్టకుండా, ఫీడ్ షాపులు మూసివేసి నిరసన తెలిపారన్నారు. ఆక్వారంగ చరిత్రలో చేపల, రొయ్యల రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈనెల 15న భీమవరంలో ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి నిర్వహిస్తారన్నారు.


