ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్కూటీ | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్కూటీ

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

వ్యక్తి మృతి

న్యాయం చేయాలంటూ బంధువుల రాస్తారోకో

కలిగిరి: మండలంలోని కలిగిరిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా కావలి – దుత్తలూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను స్కూటీ ఢీకొట్టిన ఘటనలో పర్రే హజరత్‌ (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం గ్రామానికి చెందిన హజరత్‌ కూలీ పనులు చేస్తుంటాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం రాత్రి కలిగిరిలో పనులు చూసుకుని తిరిగి తన స్వగ్రామానికి స్కూటీపై బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలై చనిపోయాడు. హజరత్‌ మృతి విషయం తెలుసుకున్న జిర్రావారిపాళెం ఎస్సీ కాలనీవాసులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ యజమానులు రావాలని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రాక్టర్‌లో కొయ్యలు ఉండటంతో అక్కడే ఉన్న మిల్లుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను హజరత్‌ ఢీకొట్టాడో.. ఒక్కసారిగా ఆగడంతో ఢీకొన్నాడో తేల్చాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌లో ఉన్నవారు పరారైనట్లు చెప్పారు. ఆ వాహన సంబంధీకులు వింజమూరుకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. వారు వచ్చే వరకు మృతదేహాన్ని తీసేది లేదని, ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తే ఒప్పుకోమని తేల్చిచెప్పారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఏఎస్సై రామచంద్రయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement