● గంగపుత్రులతో బాబు ‘ధృతరాష్ట్ర కౌగిలి’ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

● గంగపుత్రులతో బాబు ‘ధృతరాష్ట్ర కౌగిలి’ రాజకీయం

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తమ భవిష్యత్‌ను ఉజ్వలం చేసే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టి వెన్నుపోటు పొడవడం, రెండు దశాబ్దాలుగా తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళనాడు, పాండిచ్చేరి మెకనైజ్డ్‌ బోట్లను ప్రాణాలకు తెగించి నిర్బంధిస్తే వాటిని వదిలేసి తమ బతుకులపై దెబ్బ కొట్టి టీడీపీ చేసిన ద్రోహానికి మత్స్యకారులు రెండు నెలలుగా రగలిపోతున్నారు. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల తీరుతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు తాజాగా వారిని బుజ్జగించే రాజకీయానికి చంద్రబాబు తెరతీశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ కాలానికి ఇచ్చే పరిహారాన్ని ఏ నాడు అదే సమయంలో ఇచ్చిన పాపాన పోలేదు. కానీ అందుకు భిన్నంగా ఈ ఏడాది వేట నిషేధ కాలంలోనే జువ్వలదిన్నెకు పక్కనే తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం అర్థమవుతోంది. ఇప్పటికే తీర గ్రామాల్లో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు కుటుంబ సభ్యులను నిషేధిస్తూ మత్స్యకారులు ‘దురాయి’ వేశారు. ఈ క్రమంలో మత్స్యకారులపై వల్లమానిన ప్రేమ ఒలకబోసేందుకు చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయానికి తెర తీసినట్లు రాజకీయ అభిజ్ఞ వర్గాల బోగట్టా.

చంద్రబాబు సర్కార్‌ చర్యలతో

భవిష్యత్‌కు బీటలు

మత్స్యకారుల భవిష్యత్‌ను కాంక్షించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించారు. ఎన్నికల కోడ్‌తో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆ తర్వాత ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ క్రెడిట్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని, మత్స్యకారుల్లో ఆయనకు బలం పెరుగుతుందని భావించిన చంద్రబాబు సర్కారు వినియోగంలోకి తేకుండానే నిర్వీర్యం చేసే కుట్రకు తెగించింది. ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేట్‌ పరం చేసేందుకు రహస్యంగా సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయం శంకుస్థాపన చేసే వరకు మత్స్యకారులకు కూడా తెలియకుండా చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఈ ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసేందుకు దానికి కేటాయించిన 78.6 ఎకరాల్లో ముఖ ద్వార ప్రాంతంలోనే తొలి దశలోనే 29.5 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టేసి ఒక్క రోజు ముందు వచ్చి శంకుస్థాపన చేసి మత్స్యకారుల భావితరాలకు సైతం ద్రోహం చేశారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా తీర ప్రాంతంలో తమిళ జాలర్ల అకృత్యాలు ఎక్కువయ్యాయి. మెకనైజ్డ్‌ బోట్లతో జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలోకి చొరబడి స్థానిక మత్స్యకారులు వేటాడిన మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు. అడ్డుపడే ఈ ప్రాంత మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారు. వలలు, పడవలు ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రాణాలకు తెగించి కావలి మండలం పెద్దపట్టపుపాళెం, బోగోలు మండలం జువ్వలదిన్నె ప్రాంతాల్లో నాలుగు పాండిచ్చేరి బోట్లను పట్టుకున్నారు. ఐదు నెలలుగా పోలీస్‌, మత్స్యకార, మైరెన్‌ అధికారుల అధీనంలో ఉన్న బోట్లు మార్చి 16వ తేదీ రాత్రి మాయమయ్యాయి. ఈ ద్రోహం వెనుక టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు పాత్ర ఉందనే విషయం బయటకు రావడంతో వారిలో ఆగ్రహవేశాలు మిన్నంటాయి. బీద వెనుక మంత్రి లోకేశ్‌, మరో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారనే విషయంతో మత్స్యకారులు ఇంకా రగిలిపోతున్నారు. ఐదు నెలలుగా స్థానిక మత్స్యకారుల నిర్బంధంలో పాండిచ్చేరి ఉండగా అప్పటి నుంచి ఇటు వైపు కన్నెత్తి చూడడానికి భయపడిన తమిళ జాలర్లు.. బోట్లు విడుదల చేసిన మరుసటి రోజు నుంచే విచ్చలవిడిగా తీరం వైపు దూసుకువచ్చి ఆంధ్రా మత్స్యకారులకు సవాల్‌ విసిరారు.

మత్స్యకారుల భవిష్యత్‌కు వైఎస్‌ జగన్‌ బాటలు

తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, భావితరాల భవిష్యత్‌ను ఉజ్వలం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక అభివృద్ధి చేపట్టారు. ప్రాణాలకు తెగించి కడలిపై వేట సాగిస్తే తప్ప పూట గడవని స్థితిలోని మత్స్యకారులకు మరో బతుకు దెరువు లేదు. ఆంధ్రా మత్స్యకారులకు హైస్పీడ్‌ మెకనైజ్డ్‌ బోట్లు లేకపోవడంతో వేట సాగక బతుకు గడవక తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, గుజరాత్‌ వంటి పక్క రాష్ట్రాలకు వలసల కూలీలుగా వెళ్లి మత్స్యకారులు, యువత జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు, తమిళ బోట్ల దాష్టీకాలను గుర్తించి దీనికి చెక్‌ పెట్టాలంటే.. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించడమే ఒక్కటే మార్గమని భావించారు. అధికారంలోకి రాగానే ఏక కాలంలో హైస్పీడ్‌ మెకనైజ్డ్‌ 1250 బోట్లు నిలిపే విధంగా సుమారు 78.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి రూ.2 కోట్లు విలువ చేసే మెకనైజ్డ్‌ బోటుకు స్థానిక మత్స్యకారులను యజమానులుగా చేసే విధంగా 50 శాతం సబ్సిడీతో 1250 బోట్లను ప్రభుత్వం అందించేందుకు ప్రణాళిలు సిద్ధం చేశారు. ఫిషింగ్‌ హార్బర్‌కు అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్‌, మార్కెటింగ్‌, ఫుడ్‌ కోర్టుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిషింగ్‌ హార్బర్‌లో కోల్డ్‌ చైన్‌, ఐస్‌ ప్లాంట్‌, చిల్‌ రూమ్‌ వంటి మౌలిక వసతులు, బోట్‌ రిపేర్‌ వర్క్‌ షాపులు, గేర్‌ షెడ్‌లు, నెట్‌ మెండింగ్‌ షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం కావడంతో ఎన్నికల సమయానికి పూర్తయింది. కానీ కోడ్‌ రావడంతో మత్స్యకారులకు అంకితం చేయలేకపోయారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ వినియోగంలోకి వచ్చి ఉంటే.. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మెకనైజ్డ్‌ బోట్లతో విస్తృతంగా మత్స్య సంపదను సేకరిస్తూ.. ఆంధ్రా మత్స్యకారుల తరతరాలు ఆర్థికంగా సంపన్నులుగా మారేందుకు అవకాశం ఉండేది.

ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళ బోట్లను వదిలేశారు

మత్స్యకారుల భావితరాల భవిష్యత్‌ జువ్వలదిన్నె హార్బర్‌ ప్రైవేట్‌ పరం

రెండు నెలలుగా రగిలిపోతున్న తీర గ్రామాలు

బోట్లు వదిలేసిన కుట్రధారు బీద మస్తాన్‌రావు, కుటుంబానికి తీరంలో నిషేధాజ్ఞలు

ఇంత జరిగినా.. హార్బర్‌ విషయంపై స్పష్టత ఇవ్వని టీడీపీ సర్కారు

ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మత్స్యకార జపం

జువ్వలదిన్నె హార్బర్‌పై నోరు మెదపని చంద్రబాబు

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మత్స్యకారులను మోసం చేస్తూనే ఉన్నాడు. ఈ దఫా అయితే ‘జీవిత కాలం’ ద్రోహం తలపెట్టారు. తాజాగా గంగపుత్రులతో ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయానికి తెర తీశాడు. దశాబ్దాలుగా తమిళబోట్లతో జీవనాధారం కోల్పోతున్న మత్స్యకారులు.. తమ ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను మంత్రి లోకేశ్‌, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుట్రలు చేసి వదిలేసి టీడీపీ చేసిన ద్రోహం రెండు నెలలుగా మానని గాయంగానే ఉంది. మత్స్యకారుల ఉజ్వల భవిష్యత్‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నెల ఫిషింగ్‌ హార్బర్‌తో బాటలు వేస్తే.. చంద్రబాబు ఆ భవిష్యత్‌ను భగ్నం చేస్తూ.. ఆశలను చిదిమేసే కుట్ర పూరిత చర్యలకు తెగించడాన్ని తీర ప్రజలు మరిచిపోలేకున్నారు. టీడీపీ చర్యలతో తీర ప్రాంతంలో ఆ పార్టీ పేరెత్తితేనే మత్స్యకారులు ఉడికిపోతున్నారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు జువ్వలదిన్నెకు పక్కనే ఉన్న తుమ్మలపెంట కేంద్రంగా ‘మత్స్యకారుల సేవలో’ పథకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు.

మత్స్యకారుల బతుకు దెరువు, భవిష్యత్‌ అయిన జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ విషయంపై చంద్రబాబు ఇంత వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని ప్రైవేట్‌ సంస్థకు సర్కారు కట్ట బెట్టింది. హార్బర్‌ను ఎప్పటిలోగా మత్స్యకారులకు అంకితం చేస్తారో చెప్పకపోగా, వీరి కోసం గత ప్రభుత్వం తీసుకున్న ప్రణాళిక అమలు విషయంపైనా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గత నెలలో టీడీపీ ప్రభుత్వంపై మత్స్యకారులు మండిపడుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు త్వరలోనే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రారంభిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర నెల్లూరులో మీటింగ్‌లో చెప్పడం గమనార్హం. ఫిషింగ్‌ హార్బర్‌ విషయంలో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. తుమ్మలపెంట వేదికగా చంద్రబాబు నిర్వహించే మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఫిషింగ్‌ హార్బర్‌ విషయంలో స్పష్టత ఇస్తారా? లేక.. తన మాయ మాటలతో మభ్యపెట్టి ధృతరాష్ట్ర కౌగిలితో నలిపేస్తారా? అనేది తేలనుంది.

Advertisement
 
Advertisement
Advertisement