ఇది నకిలీ నోట్ల ముద్రణతో సమానం ! | - | Sakshi
Sakshi News home page

ఇది నకిలీ నోట్ల ముద్రణతో సమానం !

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

వెంకటాచలం: మండలంలోని కాకుటూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో స్వయంభూవుగా కొలువైన దుర్గా సమేత అభయలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులను అటవీశాఖాధికారులు దారి దోపిడీ చేస్తున్నారు. అనధికారికంగా అక్రమ వసూళ్ల దందాలో కూటమి నేతలను మించిపోయారు. అధికారం పార్టీ నేతలు కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు ప్రకృతి సంపదను దోచుకుంటుంటే.. అటవీశాఖాధికారులు మరో అడుగు ముందుకేసి పంచభూతాలను దోచుకుంటున్నారు. అటవీ స్థలంలోకి అడుగు పెడుతున్నారంటూ తలకు రూ.20 లెక్కన అనధికారికంగా అక్రమ వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు.

చారిత్రత్మాక అభయలింగేశ్వరస్వామి ఆలయం

ఇక్కడి స్థల పురాణాన్ని పరిశీలిస్తే శతాబ్దాల క్రితం దుర్గా సమేతంగా అభయలింగేశ్వరస్వామి స్వయంభూవుగా కొలువైనట్లు తెలుస్తోంది. స్వయంభూవుగా వెలసిన స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం ప్రబలంగా ఉంది. ఆర్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న ఆలయానికి జిల్లా నుంచే కాకుండా దూర ప్రాంతాల జిల్లాల నుంచి కూడా కార్తీక మాసం, మహాశివరాత్రి మాసంలో వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటే.. ప్రతి సోమవారం దాదాపు నాలుగైదొందల మంది భక్తులు వస్తుంటారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆలయానికి మరింత ప్రచారం కల్పించే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆలయానికి పక్కనే ఉన్న అటవీశాఖ భూమిలో ఆ శాఖ ఆధ్వర్యంలో ఏకో పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే కొంత మేర పనులు జరిగాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో పనులు అయితే ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

అటవీశాఖాధికారులు ప్రైవేట్‌ వ్యక్తులను పెట్టి ఎకో పార్కు పేరుతో వసూలు చేస్తూ ఇస్తున్న రసీదులు నకిలీ నోట్ల ముద్రణతో సమానమని విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా అటవీశాఖనే వసూళ్లు చేస్తుంటే.. ఆ రసీదులపై ఆ శాఖ లోగో ఎందుకు ముద్రించడం లేదని, సీల్‌ ఎందుకు వేయడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారికంగా టెండర్లు పిలవకుండా, ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ విధంగా ఈ రకంగా ఎంట్రీ రుసుం వసూలు చేస్తారని భక్తులు మండి పడుతున్నారు. ఈ నెల 6వ తేదీన సాక్షికి దొరికిన ఎకో పార్కు ఎంట్రీ రుసుం రసీదును పరిశీలిస్తే.. సీరియల్‌ నంబరు 18177 ఉంటే.. ఒక్కొక్కరి నుంచి రూ.20 లెక్కన రూ.3,63,540 వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఇది ఒక బ్యాచ్‌ రసీదులే అని తెలుస్తోంది. ఇంకెన్ని బ్యాచ్‌ల రసీదులతో భక్తులను అటవీశాఖాధికారులు నిలువు దోపిడీ చేశారో ఆ అభయలింగేశ్వరస్వామికే ఎరుక. ఈ విషయంపై వివరణ కోరేందుకు అటవీశాఖ రేంజర్‌ మాల్యాదిని ఫోన్‌ ద్వారా సంప్రదించగా సమాధానం చెప్పేందుకు నిరాసక్తత చూపుతూ లిఫ్ట్‌ చేయకపోవడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అటవీశాఖ/వెంకటాచలం పేరుతో ప్రభుత్వ లోగోలు కూడా లేకుండా ముద్రించి దోచుకోవడం వెనుక అటవీశాఖాధికారుల బరితెగింపు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే దోపిడీ చేస్తూ.. వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అప్పుడే మాస్టర్‌ ప్లాన్‌

అనధికారికంగా

అక్రమ వసూళ్ల దందా

వెంకటాచలం అటవీ ప్రాంతంలో

అభయలింగేశ్వరస్వామి ఆలయం

అనుబంధంగా పర్యాటక స్థలంగా ఎకో పార్క్‌ అభివృద్ధికి గత ప్రభుత్వం శ్రీకారం

పార్క్‌ సంగతి దేవుడెరుగు.. ఆలయానికి వెళ్లాలన్నా ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే

ఇంకా పూర్తి కాని పార్క్‌.. అప్పుడే అనధికారికంగా వసూళ్లు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

ఎకో పార్కు పనులు జరుగుతున్నా.. జరిగినా.. అటవీశాఖ ఆధ్వర్యంలోనే నడిచే ఈ పార్కు ద్వారా నాలుగు రూపాయలు దండుకునే అవకాశం ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోవడంతో ఆ అవకాశం రాకపోవడంతో అటవీశాఖాధికారులు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నేతలు అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తుంటే.. అందుకు తామేమి తక్కువ కాదని నిరూపించుకునే రీతిలో దేవాలయానికి వెళ్లే భక్తులను ఎకో పార్కు ఎంట్రీ ఫీజు పేరుతో మనిషికి రూ.20 లెక్కన అనధికార స్లిప్‌లిచ్చి దోచుకుంటున్నారు. ఆలయానికి భక్తులెవరూ నిర్మాణంలో ఉన్న ఎకో పార్కు ఎంట్రెన్స్‌ నుంచి కూడా వెళ్లడం లేదు. ఆ పక్కనే ఇండస్ట్రీయల్‌ ఏరియా పక్కనే ఎంతో కాలంగా ఉన్న వేరే దారిలోనే వెళ్తున్నారు. అయితే ఆ దారి స్థలం మాదేనంటూ దేవాలయానికి వెళ్లే మార్గంలోనే భక్తులును అడ్డుకుని అక్రమంగా వసూలు చేయడం, పార్క్‌కు వెళ్లకపోయినా రుసుం తప్పనిసరి చేయడం భక్తులను షాక్‌కు గురి చేస్తోంది. ఈ అక్రమ వసూళ్లపై తరచూ గొడవలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వివాదాన్ని మరింత రగిలిస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నేతలు అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తే.. మేమేమీ తక్కువ కాదంటూ అటవీ శాఖ సైతం అక్రమ వసూళ్లకు బరి తెగించింది. ప్రభుత్వ, అటవీశాఖ లోగోలు, సీల్స్‌ లేకుండానే ఎకో రసీదులతో దోపిడీ చేస్తోంది. కాకుటూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో శతాబ్దాల క్రితం స్వయంభూవుగా దుర్గా సమేత అభయలింగేశ్వరస్వామి కొలువైన ఆలయం ఉంది. ఆర్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు ఈడేర్చే అభయలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు విశిష్ట రోజుల్లో వేలాది మంది, ప్రతి సోమవారం వందలాది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయ విశిష్టను మరింత ప్రాచూర్యంలోకి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుబంధంగా పర్యాటక కేంద్రంగా ఎకో పార్క్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అయితే పార్క్‌ ఇంకా పూర్తి కాలేదు కానీ అటవీశాఖ అధికారులు అనధికారికంగా ఎకో పార్కు పేరుతో ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. తాము పార్కుకు వెళ్లడం లేదని, ఆలయానికి వెళ్తున్నామన్నా.. అటవీశాఖ సిబ్బంది భక్తులపై బలవంతపు వసూళ్లకు దిగడం తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement