నెల్లూరు (దర్గామిట్ట): దామవరంలో ప్రతిపాదిత విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ అవినీతి మరకలతో చిక్కుకుంది. భూములు కోల్పోతున్న నిరుపేద రైతులకు న్యాయంగా అందాల్సిన పరిహారం.. అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తెరవెనుక ఓ మాజీ ఐఏఎస్ అధికారి చక్రం తిప్పుతూ, ప్రభుత్వ నిబంధనలను సైతం తుంగలో తొక్కి మేత పొరంబోకు భూములకు పరిహారం దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. దీనికి స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం తోడవడంతో విమానాశ్రయ పరిహార పంపిణీ అవినీతి బాగోతంలా మారింది.
ఇదీ వ్యవహారం
దామవరంలోని సర్వే నంబర్ 1 – 1లో సుమారు 400 ఎకరాల విస్తీర్ణం కలిగిన మేత పొరంబోకు భూమి ఉంది. దీన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చంటూ 2017లో అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాళ వల్లవన్ ఆదేశాలిచ్చారు. అయితే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, స్థానికంగా ఓ ఫ్యాక్టరీ యజమానులు కుమ్మకై ్క.. ఈ భూమిని సాగు చేసుకుంటున్న రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేశారు. తమకు అనుకూలంగా సెక్రటేరియట్ స్థాయిలో చక్రం తిప్పి, వీటికి పరిహారం అందేలా ప్రత్యేక జీఓను సైతం జారీ చేయించుకున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇందులో విచిత్రమేమిటంటే కొనుగోలు చేసిన పెద్ద మనుషులకు రెండు భాగాలు.. రైతుకు ఓ భాగం మేర పరిహారం దక్కేలా ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇదే నిబంధన సామాన్య రైతులకు మాత్రం వర్తించదని, వీరికి పరిహారం అందాలంటే భారీగా మామూళ్లు సమర్పించుకోవాలని రెవెన్యూ అధికారులు తెగేసి చెప్తుండటం గమనార్హం.
ఆ అనుభవం.. అవినీతికి పెట్టుబడి..!
తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నెల్లూరులోని కలెక్టరేట్లో పనిచేసిన అనుభవంతో ఎవర్ని ఎలా మేనేజ్ చేయాలో తనకు బాగా తెలుసునంటూ సదరు ఆఫీసర్.. కార్యాలయంలోనే బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. కావలికి చెందిన ఓ రిటైర్డ్ తహసీల్దార్‌తో కుమ్మకై ్క, కేవలం ప్రసన్నం చేసుకున్న వారి ఫైళ్లనే క్లియర్ చేస్తున్నారు. తమకు వాటా ఇవ్వందే ఫైలు కదలదంటూ సిబ్బందికే సదరు అధికారి హుకుం జారీ చేయడం బరితెగింపునకు అద్దం పడుతోంది.
సమగ్ర విచారణ జరిగేనా..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ నుంచి విమానాశ్రయ పనుల్లో కదలిక రావడంతో ఈ అవినీతి పుట్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మేత పొరంబోకు భూముల ముసుగులో జరుగుతున్న ఈ భారీ కుంభకోణంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. అలా కాని పక్షంలో ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల పాలవడం ఖాయంగా కనిపిస్తోంది.
పాపం గిరిజనులు..
రోడ్డున పడిన వారసులు
అధికారుల ధనదాహానికి అమాయక గిరిజన కుటుంబాలు బలైపోతున్నాయి.
సున్నంబట్టికి చెందిన ఈగా పాపయ్యకు సంబంధించిన 0.65 సెంట్ల భూమికి గానూ ఆయన మరణానంతరం ఎనిమిది మంది వారసులకు పరిహారం అందాల్సి ఉంది. ఎకరాకు రూ.13 లక్షలొస్తున్నా, అధికారుల వాటా తేలందే చెక్కులు ఇవ్వమంటూ వారిని రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు.
ఇదే గ్రామానికి చెందిన ఈగా సురేంద్ర, పాపయ్య అనే మరో వ్యక్తికి 1958లో ఇచ్చిన 9.72 ఎకరాల డీ పట్టా భూమికి పరిహారమివ్వాలని గత కలెక్టర్ ఆనంద్ ఆదేశించినా, స్థానిక అధికారి మాత్రం కొర్రీలు పెట్టి నిలిపేశారు. మీకు లక్షల్లో డబ్బులొస్తున్నాయి.. మా సంగతేంటి అంటూ సదరు అధికారి నిర్లక్ష్యంగా ప్రశ్నిస్తుండటం బాధితులను విస్మయానికి గురిచేస్తోంది.
అవినీతి ఊబిలో విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ
దామవరంలో తిరుగుతూ చక్రం తిప్పుతున్న మాజీ ఐఏఎస్
మేత పొరంబోకు భూములపై కన్ను
అస్మదీయుల కోసం ప్రత్యేక జీఓ..?
మామూళ్లిస్తేనే ఫైళ్లు కదులుతాయంటున్న రెవెన్యూ యంత్రాంగం


