సాగర తీరంలో మత్స్యకార బోట్ల వివాదం కావలి టీడీపీలో పొలిటికల్ మలుపు తీసుకుంది. బోట్ల మాయం వెనుక బీద సోదరుల పాత్ర వెలుగులోకి రావడంతో దీనికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆజ్యం పోయడంతో రాజకీయ ఆధిపత్యం కాస్త ప్రతీకారంగా రూపుదాల్చింది. ఈ పరిణామం కావ్య గుప్పెట్లోని రియల్ ఎస్టేట్ గుట్టు విప్పుతోంది. అధికార పార్టీలోని రాజకీయ వైరం ఈ వ్యవహారం మరింత వేడి పెంచుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్న నేతలు బోట్ల వివాదాన్ని ఆయుధంగా మార్చుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రియల్టర్ల పాత్ర, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, తెరచాటున జరిగిన డీల్‌లు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల నిర్బంధంలోని బోట్ల మాయం వ్యవహారం రట్టు కావడంతో అధికార పార్టీలోని ఇద్దరి ముఖ్య నేతల మధ్య రగులుతున్న రాజకీయ ఆధిపత్య వైరం ముదిరిపాకాన పడింది. ఈ క్రమంలో రియల్టర్ల అక్రమాలు, తెరచాటు డీల్స్ గుట్టు రట్టవుతున్నాయి. కావలి నియోజకవర్గం టీడీపీలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు వరకు బీద రవిచంద్ర ఆధిపత్యంగా ఉండేది. ఆ పార్టీ రాజకీయ సమీకరణాల్లో దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) టీడీపీ తెరపైకి రావడం, ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో పార్టీ మొత్తాన్ని ఎమ్మెల్యే కావ్య తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి బీద వర్గానికి చుక్కలు చూపించడం తెలిసిందే. అదే సమయంలో బీద రవిచంద్ర సైతం ఎమ్మెల్సీ కావడంతో కావలిలో తన పట్టును మరింత బిగించారు. బీదకు అత్యంత సన్నిహితుడు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఆకస్మిక మరణంతో కావలిలో కావ్య ఆధిపత్యానికి బీద చెక్ పెట్టారు. ఇలా ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది.
బోట్ల మాయం వివాదంలో
ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆజ్యం
మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి నిర్బంధించిన నాలుగు తమిళ బోట్లను జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఉంచగా, తమిళ బోట్ల యజమానులతో రాజకీయ లాలూచీ కుదరడంతో మంత్రి లోకేశ్ ఆదేశాలతో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు ముగ్గురు కాపులకు భారీగా నగదు ముట్టజెప్పి రహస్యంగా వదిలేసిన వ్యవహారం రట్టు అయింది. ఇటీవల కొంత కాలంగా పార్టీ అధిష్టానం వద్ద బీద రవిచంద్ర తన పరపతి ఉపయోగించి నియోజకవర్గంలో కావ్య పవర్ కట్ చేయించడం తెలిసిందే. మత్స్యకారుల ఆగ్రహానికి గురైన బీద సోదరులను రాజకీయంగా పతనం చేసేందుకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఆజ్యం పోస్తున్నారనే ప్రచారం లేకపోలేదు.
మత్స్యకార బోట్ల వివాదంలో బీద సోదరులు
ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రాజకీయ ఆగాధం
బోట్ల వ్యవహారంలో ఎమ్మెల్యే ఆజ్యం
దగుమాటి గుప్పెట్లోని రియల్టర్లపై
బీద విజిలెన్స్ గన్
రియల్టర్లపై బీద విజిలెన్స్ అస్త్రం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొందరు రియల్టర్లు దాదాపు 130 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకున్నారంటూ తెగ ప్రచారం చేసి గద్దె నెక్కిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి.. అధికారంలోకి రాగానే తెగ హడావుడి చేశారు. ఏకంగా మున్సిపల్ అధికారులతో ఇవి అక్రమ లేఅవుట్లంటూ పేపర్ పబ్లికేషన్లు జారీ చేయించారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దు రాళ్లు తొలగించారు. మధ్యలో ఏమైందో ఏమో కానీ లేఅవుట్ భూముల్లో ఉండే యంత్రాలు వెనక్కి వచ్చేశాయి. రియల్టర్లు ఎమ్మెల్యేతో డీల్ కుదుర్చుకున్నారని ప్రచారం సాగింది. ఇదే సమయంలో రియల్టర్లు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఆ తర్వాత అక్రమ లేఅవుట్ల వ్యవహారం సద్దుమణిగి పోయింది. ఈ క్రమంలో సాగర తీరంలో బోట్ల మాయం తర్వాత జరిగిన పరిణామాల్లో బీద పుట్టలో ఎమ్మెల్యే కావ్య వేలు పెట్టడంతో బీద అందుకు ప్రతీకారంగా కావ్య గుప్పెట్లోని రియల్టర్లపై విజిలెన్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. తొలుత కావ్యతో సన్నిహితంగా వ్యవహరిస్తున్న రియల్ ఎస్టేట్స్‌లో బిగ్‌షాట్స్ అక్రమాల పుట్టను తవ్వడం మొదలు పెట్టారు. ఆయా వెంచర్లలో ఎంత మేర ప్రభుత్వ భూమి ఉందనేది వెలికి తీసి, ఇందులో ఎమ్మెల్యే పాత్ర, అక్రమాల వెనుక కుదిరిన డీల్స్ ఒక్కొక్కటి వెలికి తీసి నివేదికను అధిష్టానానికి నివేదించేలా చేస్తున్నారు. ఇందు కోసం విజిలెన్స్ అధికారులను కావలిలోనే మకాం పెట్టించి తనిఖీలు చేయిస్తున్నారు. ఈ వ్యవహారంతో దగమాటితో డీల్ కుదుర్చుకున్న రియల్టర్లు ఉడికిపోతున్నారు. తమ సంగతేమిటని వాపోతున్నట్లు ప్రచారం. ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో భవంతులు వెలిశాయి. వెంచర్లలో పాట్లు అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. ఇప్పడు విజిలెన్స్ అధికారులు వెంచర్లలో అక్రమాలు వెలికి తీయడంతో కొనుగోలు చేసిన కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. మా పాట్లు పోతే పరిస్థితి ఏమిటని చెల్లించిన సొమ్ము తిరిగి వెనక్కి ఇచ్చేయమని రియల్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.


