నెల్లూరు(అర్బన్): ‘ఇసుకను దోపిడీ చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థను ప్రశ్నించడమే నేరంగా భావించారు. పాలకులు చెప్పినట్టు పోలీసులు తలాడించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై అక్రమంగా తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపారు’ అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న సత్యనారాయణరెడ్డితో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులతో కలిసి పొన్నవోలు మంగళవారం ములాఖత్ అయ్యారు. సత్యనారాయణను పరామర్శించి అతిత్వరలోనే బెయిల్ వస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు బయట పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. పెళ్లకూరు మండలంలో ఇసుక తవ్వుకునేందుకు ఇచ్చిన లీజు గడువు ముగిసినా కాంట్రాక్టర్ అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఈ దోపిడీని ప్రశ్నించేందుకు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గ్రామ ప్రజలతో కలిసి రీచ్ వద్దకు వెళ్లిన సత్యనారాయణపై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమన్నారు. ఎప్పుడో పెట్టిన కేసులను కూడా పిటీ వారెంట్ కింద చూపి బెయిల్ రాకుండా పాలకులు పోలీసులు ద్వారా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మూడు వారాలుగా కామిరెడ్డిని జైలులో ఉంచడం అప్రజా స్వామికమన్నారు. ప్రజలెవరు పాలకులను ప్రశ్నించకుండా తప్పుడు కేసులుతో భయపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ టీం చురుగ్గా పని చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. త్వరలోనే కామిరెడ్డికి బెయిల్ రావడం ఖాయమన్నారు. ఒక వేళ రాకపోతే హైకోర్టులో తానే స్వయంగా వాదించి బెయిల్ తెస్తానన్నారు.
పోలీసులకు చట్టం చుట్టం కాదు
ప్రజలు, తమ పార్టీ కార్యకర్తలపై పాలకులు చెప్పినట్టు అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు చట్టం చుట్టం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమిళనాడులో తండ్రి, కుమారుడికి సంబంధించిన కస్టోడియల్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడిన విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలన్నారు.దేశంలో న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉందనడానికి తమిళనాడు ఘటనే ఉదాహరణ అన్నారు. అధికార పార్టీ పాలకులు చెప్పినట్లు విని తప్పుచేసిన పోలీసు అధికారులను మూడేళ్ల తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టం ముందు నిలబెట్టి తీరుతామన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు ఫైర్‌వాల్ లాగా పార్టీ లీగల్ సెల్ ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో కాని కేసులను హైకోర్టులో తేలుస్తామన్నారు. పోలీసులు, పాలకులు కుమ్మౖక్కై ప్రజలను హింసిస్తే ప్రతి ఒక్క రూ నిలదీయాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ న్యాయవాది రవి మాట్లాడుతూ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై అక్రమంగా విచిత్రమైన కేసు ను బనాయించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవానికి, ఎఫ్‌ఐఆర్‌కు సంబంధమే లేదన్నారు. పాలకుల ఒత్తిడి మేరకు పోలీసులు వివిధ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారన్నారు. ఎప్పుడో పెట్టిన 420 కేసులో హైకోర్టు స్టే కూడా ఉందన్నారు. అయినా ఆ కేసును కూడా ఇప్పుడు ముందుకు తీసుకుని రావడం సిగ్గు చేటన్నారు. దీనివల్ల తాత్కాలిక సంతోషం తప్పితే పాలకులకు ఒరిగేదేమి లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలతో పాటు సామా న్య ప్రజలకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. జూనియర్ అడ్వొకేట్ రామ్‌సింహారెడ్డి పాల్గొన్నారు.
అక్రమ కేసులతో భయపెట్టాలని
చూస్తే సహించేదిలేదు
పాలకుల అడుగులకు మడుగులొత్తవద్దు
తప్పు చేస్తున్న పోలీసులు తమిళనాడు ఘటనను గుర్తుతెచ్చుకోవాలి
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్
రాష్ట్రాధ్యక్షుడు పొన్నవోలు
సెంట్రల్ జైలులో డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డితో ములాఖత్


