● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రానున్న మూడు నెలల్లో జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మే, జూన్, జూలై నెలల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లోని చేతిపంపులు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, డైరెక్ట్ పంపింగ్ స్కీంలు సమర్థవంతంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. పశువులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర సాగునీటి యాజమాన్య పద్ధతులను పాటించి నీరు వృథా కాకుండా చూడాలన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడంలో విశేషంగా కృషి చేసిన ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు రూ.50వేల నగదు బహుమతిని అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి, డ్వామా పీడీ గంగాభవాని, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి, సోమశిల ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


