పొదలకూరు : స్థానిక నిమ్మమార్కెట్ యార్డు లో నిమ్మ ధరలు మంగళవారం రికార్డు స్థాయిలో పలికాయి. ఢిల్లీ మార్కెట్లో నిమ్మకు డిమాండ్ పెరగడంతో నాణ్యత కలిగిన కాయలు బస్తా రూ.12 వేల వరకు ధరలు పలికినట్లుగా వ్యాపారులు వెల్లడించారు. వేసవి నేపథ్యంలో వారం రోజులుగా నిమ్మకాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కిలో రూ.110 నుంచి రూ.140 వరకు పలుకుతున్నాయి. నాణ్యతను బట్టి మరో రూ.5 అదనంగా కూడా చెల్లిస్తున్నారు. ప్రస్తుత ధరలను పరిశీలిస్తే ఒక్క కాయ రూ.7 నుంచి రూ.9 వరకు పడుతోంది. ఫలితంగా నిమ్మమార్కెట్ యార్డు కళకళలాడుతోంది. ప్రస్తుతం కలువాయి, చేజర్ల, రాపూరు, తదితర మండలాల నుంచి కూడా పొదలకూరు నిమ్మమార్కెట్‌కు కాయలు వస్తున్నట్టుగా వ్యాపారులు వెల్లడించారు.
కృష్ణపట్నం తీరంలో
ముమ్మర గస్తీ
ముత్తుకూరు(పొదలకూరు) : కృష్ణపట్నం సముద్రతీరంలో పుదుచ్చేరి, తమిళనాడు ఫిషింగ్ బోట్ల అక్రమ ప్రవేశాన్ని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలను ప్రారంభించారు. కోస్టల్ పోలీస్ వింగ్ స్టేట్ ఇన్‌చార్జి, విశాఖ మైరెన్ ఐజీ గోపీనాథ్‌జెట్టి ఆదేశాల మేరకు ఏఎస్పీ మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడు హైస్పీడ్ బోట్లతో సముద్రంపై గస్తీని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మధుసూదన్‌రావు మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని సముద్ర జలాల్లోకి ఇతర రాష్ట్రాలకు చెందిన ఫిషింగ్ బోట్లు అక్రమ ప్రవేశాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. మైరెన్ పోలీసు, మత్స్య, అటవీశాఖల అధికారుల సమన్వయంతో గస్తీని కొనసా గిస్తున్నట్లుగా చెప్పారు. సముద్రంలో నిరంతర గస్తీ ద్వారా విద్రోహశక్తుల అక్రమ ప్రవేశం, అక్రమ వేట కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకట్ట వేయనున్నట్లుగా తెలిపారు. డీఎస్పీ బాలిరెడ్డి, సీఐ వెంకటేశ్వరరెడ్డి, ఇందుకూరుపేట ఎస్సై నాగార్జునరెడ్డి, మైరెన్ ఎస్సై అంజిరెడ్డి, ఎఫ్‌డీఓలు శ్రీనివాసరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీఎన్ రాధాకృష్ణ
వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఉదయగిరి: ఏబీఎన్ చానల్ అధినేత రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఇళ్లలోని మహిళలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారం చేస్తున్న విషయం అందరికీ తెలుసునన్నారు. ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిజం విలువలను ఎప్పుడో కోల్పోయాయన్నారు. టీడీపీ కోసం, అమరా వతిలో తన అక్రమ సంపాదన పెంచుకోవడం కోసం, చంద్రబాబు మెప్పు కోసం పాత్రికేయ వృత్తిలో ఉండి మహిళల గురించి నీచమైన భాషలో మాట్లాడడం క్షమించరానిదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మావిగన్ రాజధానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు బినామీ అయిన రాధాకృష్ణ దిగజారి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనుక్కు తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. జర్నలిస్టు ముసుగులో రాజకీయ నేతలకంటే హీనమైన భాషలో మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రాధాకృష్ణ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.


