● మావిగన్ ద్వారా రూ.లక్షల కోట్లను
ఆదా చేయొచ్చు
● ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
నెల్లూరు(పొగతోట): అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో అక్కడ జరుగుతున్న అవినీతి, దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కొందరి రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. జగనన్న సూచించిన మావిగన్ కారిడార్ రాజధానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలన్నారు.
డ్రగ్స్, మద్యం ఏరులు..
మహిళలకు రక్షణ కరువు
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. మ ద్యం, డ్రగ్స్ ఏరులై పారుతున్నా కూటమి నేతలు పట్టించుకోవడం లేదన్నారు. మద్యం సేవించిన వ్యక్తులు మృగాలుగా ప్రవర్తించి మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రోజుకు నలుగురు మహిళలపై అత్యాచారాలు, 60 మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 15 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడి నాలుగు దఫాలు గర్భవతిని చేశాడన్నారు. ఆమె స్వయంగా ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు లేవన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళల రక్షణకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేశారన్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కనీస చర్యలు లేనందు వల్లనే నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయన్నారు. జగనన్నను తిట్టడానికి హోం మంత్రికి పదవి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చీవాట్లు పెట్టినా ప్రభుత్వ పెద్దల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. హోం మంత్రి పేకాట స్థావరాలు, మద్యం దుకాణాల వద్ద పీఏలతో డబ్బులు వసూలు చేస్తోందన్నారు.
బీఆర్ నాయుడుపై చర్యలకు మీనమేషాలెందుకు?
ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తిపై కేవలం ఆడి యో లీక్ కాగానే జగనన్న అతన్ని తొలగించి ఆ చానల్ ప్రతిష్టను ఇనుమడింప చేస్తే.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఆరోపణలు వచ్చినా ఇంత వరకు పదవి నుంచి తొలగించలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు అధికమయ్యాయన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగనన్నను సీఎం చేసేందుకు మహిళలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
● రాష్ట్ర వైఎస్సార్‌సీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే కూ టమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. మహిళా శక్తిని కూటమి తక్కువగా అంచనా వేసిందన్నారు. ఇప్పటికై నా కూటమి నేతలు మహిళా లోకంపై జరుగుతున్న దాడులను నివారించి, అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీసునంద పాల్గొన్నారు.


