నెల్లూరు(టౌన్): వెంకటాచలం మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో రాజకీయం జోక్యం అధికమైంది. ఆయా జిల్లాల్లో ఉండే అధికార పార్టీకి చెందిన నేతల సిఫార్సుతో డిప్యుటేషన్లపై ఇతర వర్సిటీలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికితోడు అక్కడ పనిచేస్తున్న అధికారులు సైతం వత్తాసు పలుకుతుండటంతో కొంతమంది అధ్యాపకులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా మారింది. వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులు కొరత తీవ్రంగా వేధిస్తున్నా కొందరు నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లపై ఇతర యూనివర్సిటీలకు వెళ్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకులు నియామకం చేపడుతున్నట్లు కూటమి ప్రభుత్వం చాలాకాలంగా చెబుతున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. వర్సిటీల్లో బోధించేందుకు సరిపడా అధ్యాపకుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ముగిసినా..
విక్రమ సింహపురి యూనివర్సిటీలోని సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో నలుగురు అధ్యాపకులను నియమించారు. వారిలో ఒకరు రిటైర్ అయ్యారు. ఒకరు డిప్యుటేషన్‌పై ఎస్వీ యూనివర్సిటీకి వెళ్లగా మిగిలిన ఇద్దరిలో ఒకరు రిజిస్ట్రార్‌గా, మరొకరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక్కరే సోషల్ వర్క్ విభాగంలో విధుల్లో ఉన్నారు. అధ్యాపకురాలు కుసుమ గతంలో ఎస్వీ వర్సిటీకి వెళ్లారు. కాలం ముగిసిన వెంటనే తిరిగి వీఎస్‌యూకు వచ్చారు. విధుల్లో చేరినా అధికార పార్టీ నేత సిఫార్సుతో డిప్యుటేషన్‌పై మళ్లీ ఎస్వీకి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఏడాది ఫిబ్రవరిలో గడువు ముగిసినా ఆమె ఇక్కడికి రాలేదు. వీఎస్‌యూ సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను ఎస్వీలో సోషియాలజీ అధ్యాపకురాలిగా పంపడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. విక్రమ సింహపురి వర్సిటీలో జీతం, ఎస్వీలో విధులు నిర్వహించడం పరిపాటిగా మారింది. డిప్యుటేషన్ ముగిసినా ఎస్వీ అధికారులు రిలీవ్ చేయకుండా ఉండటం, వీఎస్‌యూ అధికారులు ఇక్కడికి వచ్చి వెంటనే జాయిన్ కావాలని ఆదేశాలివ్వలేదని తెలిసింది.
మరో ఇద్దరు
ఎస్వీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు వీఎస్‌యూలోని టూరిజం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అధ్యాపకుడు జవహర్‌బాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో తమ పరిశోధన పత్రాన్ని దొంగిలించారని మహిళా ప్రొపెసర్ జయంతి రంజన్ వీఎస్‌యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో పరిశోధన పత్రాన్ని దొంగిలించినట్లు తేలడంతో జవహర్‌బాబుపై పాలకమండలిలో పనిష్మెంట్ విధించారు. ఆయన పనిచేసే డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి మూడేళ్లపాటు పరిశోధన విద్యార్థులను అలాట్ చేయకపోవడం, రెండు ఇంక్రిమెంట్లను కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు భవిష్యత్‌లో పాలనాపరమైన బాధ్యతలను అప్పజెప్పకూడదని తీర్మానించారు. అయితే ప్రస్తుతం అతని పనిష్మెంట్‌ను ఎత్తివేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. వర్సిటీలో పాలనా పరమైన అంశాల కంటే ఇలాంటి వివాదాస్పద అంశాల్లో రిజిస్ట్రార్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు. డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు వీఎస్‌యూ రిజిస్ట్రార్, ఎస్వీయూ రిజిస్ట్రార్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
వీఎస్‌యూలో నిబంధనలకు
విరుద్ధంగా డిప్యుటేషన్లు
ఫిబ్రవరితో ముగిసినా
వెనక్కి రాని అధ్యాపకురాలు
వెళ్లేందుకు మరో ఇద్దరు లెక్చరర్ల ప్రయత్నాలు
కొరత ఉన్నా వెనక్కి తగ్గని వైనం
రెగ్యులర్ అధ్యాపకుల్లేక విద్యార్థుల ఇబ్బందులు
నియామకాలు చేపడతామని కాలం వెళ్లదీస్తున్న కూటమి ప్రభుత్వం
కావలి పీజీ సెంటర్‌లో..
కావలి పీజీ సెంటర్‌లో ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాగార్జున యూనివర్సిటీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయన ఐదేళ్లపాటు అక్కడ ఆర్ట్స్ కళాశాలలో ఆర్థిక శాస్త్రం విభాగానికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయా యూనివర్సిటీల్లో జరుగుతున్న డిప్యుటేషన్లపై ప్రభుత్వ జోక్యం మితిమీరడంతో పనిచేస్తున్న అధికారులు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వక తప్పడం లేదని తెలిసింది. ఇప్పటికై నా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పలువురు కోరుతున్నారు.
ఇంకా జాయిన్ కాలేదు
ఎస్వీ యూనివర్సిటీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కుసుమ డిప్యూటేషన్ కాలం ముగిసింది. ఇప్పటికే వీఎస్‌యూలో జాయిన్ కావాల్సి ఉంది. ఉన్నత విద్యామండలి నుంచి డిప్యుటేషన్లపై ఆదేశాలు వస్తే తప్పకుండా పాటించాల్సిందే. డిప్యుటేషన్లపై ఇంకా ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు.
– అల్లం శ్రీనివాసరావు, వీసీ, వీఎస్‌యూ


