● ప్రతికూల వాతావరణంతో నిలిచిన వేట
● మరోవైపు ఆగని తమిళ జాలర్ల దోపిడీ
వాకాడు: రెండు నెలలుగా సముద్రంపై ప్రతికూల వాతావరణం కారణంగా పోరుగాలి నెలకొని వేట సక్రమంగా సాగడం లేదు. సాధారణంగా విరామ సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో వేట సజావుగా సాగడమే కాకుండా మత్స్య సంపద ఎక్కువగా దొరుకుతుంది. అలాంటిది ఈ ఏడాది మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. సముద్రంలో వల వేసి ఎంత గాలించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. దీంతో డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. వేట తప్ప మరేపని తెలియని వారికి రెండు నెలలుగా పూట గడవటం కష్టంగా మారింది.
వారి వల్ల ఇబ్బందులు
ఇటీవల తమిళ జాలర్ల దోపిడీని జిల్లా మత్స్యకారులు అడ్డుకుని వారిని పట్టుకోవడం జరిగింది. మందలించి చర్యలు తీసుకోవాల్సిన నేటి ప్రభుత్వ పాలకులు కొందరు పక్క రాష్ట్రంలో ద్వారా ముడుపులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా దోపిడీదారులను వదిలిపెట్టడం జరిగింది. దీనిపై జిల్లా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అయితే ఇరు రాష్ట్రాల నడుమ ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ మళ్లీ వారంరోజులుగా తమిళ జాలర్ల దోపిడీ యథావిధిగా కొనసాగుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా తీరం వెంబడి నిబంధనలకు విరుద్ధంగా తమిళ జాలర్లు తమ స్పీడ్ బోట్లతో సముద్రంలోని మత్స్య సంపదను గాలించి తీసుకెళ్లిపోతున్నారు. అడ్డొచ్చిన స్థానిక జాలర్లను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసురుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తూ..
కడలూరు, నాగూరు నాగపట్నం తదితర ప్రాంతాలకు చెందిన జాలర్లు ప్రత్యేకంగా చిన్న రంధ్రాలతో తయారు చేసిన వలలతో స్పీడ్ బోట్ల ద్వారా హద్దులు దాటి జిల్లా సముద్రంలో చేపలను తీసుకెళ్తున్నారు. కడు పేదరికంతో సముద్ర మత్స్య సంపదే ఆధారంగా జీవనం సాగిస్తున్న జిల్లా మత్స్యకారులు కొన్నిరోజులుగా పూటగడవక లబోదిబోమంటున్నారు. కనీసం ఆయిల్ ఖర్చులు గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది వేట నిలిపేసి ఇంటికే పరిమితమయ్యారు. సాధారణంగా స్పీడ్ బోట్లు 8 నాటికల్ మైళ్ల దూరం పైన వేట చేయాలి. అలా కాకుండా తమిళ జాలర్లు అధికారుల నిబంధనలు బేఖాతరు చేయకుండా 3 నాటికల్ మైళ్ల దూరంలోనే స్పీడ్ బోట్లతో వేట చేస్తున్నారు. చిన్న నలక చేపలు సైతం పొరుగు రాష్టాల దోపిడీకి గురవుతుండటంతో స్థానిక మత్స్యకారులు బాధను వ్యక్తం చేస్తున్నారు.


