వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడు, భాస్కరాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 233, 1లో సుమారు 16 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కొండ ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ పరిరక్షణ మంత్రిత్వ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ గురువారం పరిశీలించారు. గ్రామంలో మైనింగ్‌కి సంబంధించిన కార్యకలాపాలు చేపట్టొద్దంటూ ప్రజలు జాతీ య పర్యావరణ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న చర్చి, శివాలయం, పాఠశాల, నివాస గృహాలు, వ్యవసాయ భూములు, అటవీ భూములను గ్రామస్తులు అధికారులకు చూపించారు. ఈ కొండ ప్రాంతం పశువులకు జీవనాధారమని, మైనింగ్ పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనింగ్ డీడీఏ శ్రీనివాసరావు, కొండేపోగు దిలీప్‌కుమార్, చల్లగాలి వెంకటమోహన్, నల్లగొర్ల నరసింహ, షేక్ పేరయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


