టీడీపీలో ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న అంతర్గత పోరు తాజాగా దావానంలా వ్యాపిస్తోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో భూ జగడానికి మంత్రి నారాయణ కాలుదువ్వడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. నగరంలోని వివాదాస్పద స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న అంతర్గత పోరు తాజాగా దావానంలా వ్యాపిస్తోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో భూ జగడానికి మంత్రి నారాయణ కాలుదువ్వడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. నగరంలోని వివాదాస్పద స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ

Mar 22 2026 1:32 AM | Updated on Mar 22 2026 1:32 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో మంత్రి నారాయణ కయ్యానికి కాలుదువ్వుతుండటం నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి వేమిరెడ్డి సోదరుడు కోటారెడ్డికి.. డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌ ప్రధాన అనుచరుడు దార్ల వెంకటేశ్వర్లు మధ్య స్థల వివాదం జరుగుతోంది. నగర నడిబొడ్డున ఉండే సండే మార్కెట్‌ మలుపు వద్ద ల్యాండ్‌ ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి భవనాన్ని నిర్మిస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వివాదం జరుగుతున్న సమయంలోనే సదరు స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

ఇదీ తంతు..

ట్రంక్‌రోడ్డులో ఎంపీ వేమిరెడ్డి సోదరుడు కోటారెడ్డికి 73 అంకణాల విలువైన స్థలం ఉంది. ఆ పక్కనే ఉన్న 359 – 3ఏ సర్వే నంబర్‌లో ఇరిగేషన్‌ కాలువకు సంబంధించిన స్థలమూ ఉంది. ప్రస్తుతం నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం ఇది. అయితే ఈ స్థలంలో రూప్‌కుమార్‌యాదవ్‌ ప్రధాన అనుచరుడు దార్ల వెంకటేశ్వర్లుకు ఎనిమిదంకణాల స్థలానికి గతంలో ప్రభుత్వ వాల్యూతో నగదు కట్టించుకొని పట్టా ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన భూమి ఆయన ఆక్రమణలో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇక్కడే అసలు కత..

మరోవైపు సర్వే నంబర్‌ 259 – 2ఏ ఉన్న భూమి నిషేధిత జాబితాలో ఉంది. అయితే 259 – 3 బీ 1, 2 సబ్‌ డివిజన్‌ చేసినట్లుగా రికార్డులను మార్చి.. పదంకణాల స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయించుకొని తమ ఆధీనంలో ఉంచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 18 అంకణాల స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి జీ + 2గా మున్సిపల్‌ అనుమతులను పొందారు. వాస్తవానికి ఇరిగేషన్‌ భూమిలో భవన నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు. అయితే రాజకీయ ఒత్తిడితో ప్లాన్‌ అనుమతులను అధికారులు మంజూరు చేయడం దుమారాన్ని రేపింది. భవన నిర్మాణ అనుమతులకు పేదలు వెళ్తే వంద కొర్రీలు పెట్టే అధికారులు.. ఇక్కడ మాత్రం ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు.

ఎంపీ సూచనలు బేఖాతర్‌

వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి అనుమతులివ్వొద్దని.. న్యాయపరంగా చూడాలని మున్సిపల్‌ అధికారులను ఎంపీ ఆదేశించారు. అయితే దీన్ని బేఖాతర్‌ చేస్తూ.. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే పర్మిషన్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా వివాదం జరుగుతున్న సమయంలోనే మంత్రి స్వయంగా వెళ్లి శంకుస్థాపనలో పాల్గొనడం ఎంపీపై కయ్యానికి కాలుదువ్వినట్లుగానే ఉందనే టాక్‌ సర్వత్రా వినిపిస్తోంది.

న్యాయస్థానంలో ఉన్నా..

ఉయ్యాలకాలువ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారనే విషయమై హైకోర్టును ఎంపీ సోదరుడు కోటారెడ్డి ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ మరో రెండ్రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో శంకుస్థాపనలో అమాత్యుడు పాల్గొనడంపై తమ్ముళ్లే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఊహాగానాలతోనే ఇలానా..?

ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ మార్పు ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఎంపీ సతీమణి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అమాత్య పదవి వరించే అవకాశాలూ ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. అప్పుడు నారాయణను సీఆర్డీఏకే పరిమితం చేసి, ఆ స్థానంలో ఆమెకు అవకాశం కల్పిస్తారనే చర్చా సాగుతోంది. వీటన్నింటినీ జీర్ణించుకోలేకే వేమిరెడ్డితో నారాయణ కాలుదువ్వుతున్నారని పలు వురు పేర్కొంటున్నారు.

ప్రకటనలు ఉత్తుత్తేనా..?

నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేదిలేదంటూ మంత్రి నారాయణ తరచూ ఊదరగొడుతుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, ఇదంతా ఒట్టిదేననే విషయం తేలిపోతోంది. కాలువల వెడల్పు పేరుతో పేదల నివాసాలను కూలదోసిన ఆయన.. ఇరిగేషన్‌ స్థలంలో ఉన్న భవన శంకుస్థాపనకు వెళ్లడం ద్వారా ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారోనని తమ్ముళ్లే నిట్టూరుస్తున్నారు. పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమానంటూ మండిపడుతున్నారు. కాగా ఈ విషయమై సిటీ ప్లానర్‌ రఘునాథరావు సంప్రదించగా, న్యాయస్థానం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జీ + 2 కింద అనుమతులిచ్చామని బదులిచ్చారు.

టీడీపీలో నువ్వా.. నేనా..!

వేమిరెడ్డితో కయ్యానికి దిగిన

నారాయణ

వివాదాస్పద స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

ఇది ఇరిగేషన్‌ భూమంటూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ సోదరుడు

న్యాయస్థానంలో ఉన్న తరుణంలో ఎలా పాల్గొంటారంటూ అమాత్యుడిపై రుసరుస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement