అధికలోడు.. ప్రాణాలకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

అధికలోడు.. ప్రాణాలకు ముప్పు

Mar 21 2026 4:51 AM | Updated on Mar 21 2026 4:51 AM

నిత్యం ప్రమాదాలు

చిల్లకూరు: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మట్టి, ఇసుక, గ్రావెల్‌, సిలికా, బొగ్గు, క్వార్ట్‌ ్జ తరలింపు ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ప్రధాన రహదారిపై ఖనిజాలను రవాణా చేసే సమయంలో నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే వాహనాల యజమానులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చిల్లకూరు మండలంలో సాగరమాల రహదారి నిర్మాణం చేపట్టడంతో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు అధికలోడుతో మట్టిని తరలిస్తున్నాయి. అలాగే తీర ప్రాంతంలో ఉన్న గనుల నుంచి ఇతర రాష్ట్రాలకు సిలికాను లారీలు, టిప్పర్లలో మోతాదుకు మించి లోడు చేసి తరలించేస్తున్నారు. ఇంకా సైదాపురం, గూడూరు రూరల్‌ ప్రాంతాల్లోని గనుల నుంచి నిత్యం పదుల సంఖ్యలో తెల్లరాయిని తరలించే లారీలు కనీస నిబంధనలు పాటించడం లేదని విమర్శలున్నాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి చైన్నెతోపాటుగా శ్రీసిటీలోని పలు పరిశ్రమలకు బొగ్గును తరలించే లారీలు, టిప్పర్లు కూడా మోతాదుకు మించి అధికలోడుతో నిత్యం వెళ్తుంటాయి.

పట్టించుకోకుండా..

నిత్యం అధికలోడుతో వాహనాలు తరలి వెళ్తున్నా గనులు, రెవెన్యూ, రవాణా, పోలీస్‌ శాఖలు కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే హడావుడి చేసి లారీలు, టిప్పర్ల యజమానులతో చర్చించి వ్యవహారం పెద్దది కాకుండా జాగ్రత్తలు పాటించి సర్దుబాటు చేస్తున్నారని విమర్శలున్నాయి. దీంతో వాహనాల యజమానులు కూడా ఆయా శాఖల అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు నెలవారీ మామూళ్లను సమర్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతోనే వాహనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

స్పష్టత లేకపోవడంతో..

ఖనిజ సంపద పెద్ద మొత్తంలో తరలించే సమయంలో ప్రమాదాలు జరిగితే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత రవాణా శాఖాధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేసి నిబంధనలు పాటించారా?, లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అయితే వాటికి తిలోదకాలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. అధికలోడుతో వెళ్తూ ప్రమాదానికి గురైన వాహనంలో ఎలాంటి ఖనిజ సంపద ఉంది?, దీనికి అనుమతులున్నాయా? అనే విషయాలతోపాటు ఎంతమేర రవాణా చేయాలి?, ఎంత చేస్తున్నారు? అనే అంశాలను గనుల శాఖాధికారులు పరిశీలించాల్సి ఉంది. దీనిపై వారికి స్పష్టత లేకపోవడంతో దృష్టి పెట్టడం లేదని చెబుతున్నారు. పోలీస్‌ శాఖ తూతూమంత్రంగా కేసు నమోదు చేయడం అటు తర్వాత వాహనాన్ని వదలి వేయడంతో బాధితులకు సరైనా న్యాయం జరగడం లేదనే విమర్శలున్నాయి. అన్ని శాఖల ఉన్నతాధికారులు అధికలోడు వాహనాలను కట్టడి చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

ఇష్టారాజ్యంగా వాహన రాకపోకలు

కూటమి ప్రభుత్వంలో ఇదీ పరిస్థితి

లోడు అధికంగా వేస్తున్నా చోద్యంచూస్తున్న అధికారులు

తరచూ రోడ్డు ప్రమాదాలు

మామూళ్లే కారణమా?

మట్టి, ఇసుక, గ్రావెల్‌, సిలికా, బొగ్గు, తెల్లరాయిని అధిక మోతాదులో తరలించే లారీలు, టిప్పర్లతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల మండల తీర ప్రాంతంలోని చింతవరం గ్రామం వద్ద గొర్రెల మందపైకి మట్టిని తరలించే టిప్పర్‌ దూసుకెళ్లింది. దీంతో పదికిపైగా జీవాలు మృతిచెందాయి. గూడూరు రూరల్‌ ప్రాంతంలో అధికలోడుతో తెల్లరాయి తరలించే సమయంలో బ్రేక్‌లు పడకపోవడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే చిల్లకూరు మండలం సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా మట్టిని అధికలోడుతో తీసుకెళ్తున్న టిప్పర్‌ తిక్కవరం గ్రామంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో చనిపోయాడు. అదేవిధంగా 17వ తేదీన కృష్ణపట్నం నుంచి శ్రీసిటీకి అధికలోడుతో వెళ్తున్న బొగ్గులారీ రోడ్డు పక్కనున్న ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణించే ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement