ఇంటర్‌ మూల్యాంకనం వాయిదా | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ మూల్యాంకనం వాయిదా

Mar 21 2026 4:51 AM | Updated on Mar 21 2026 4:51 AM

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన జవాబుపత్రాల మూల్యాంనాన్ని రంజాన్‌ పండగ సందర్భంగా ఈనెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత స్పెల్‌లో ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, మ్యాథ్స్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనానికి విధుల్లో నియమించిన ఇన్విజిలేటర్లు ఆదివారం జరిగే స్పాట్‌ క్యాంపు కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 25వ తేదీ నుంచి రెండో స్పెల్‌లో భాగంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, బయాలజీ, కామర్స్‌, సివిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం జరుగుతుందని వెల్లడించారు.

కంటైనర్‌ లారీ ఢీకొని..

వ్యక్తి దుర్మరణం

మనుబోలు: కంటైనర్‌ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మల్లాంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కలువాయికి చెందిన చిట్టేపల్లి రమేష్‌ (38) గురువారం రాత్రి మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డు సమీపంలో వెనుక వస్తున్న కంటైనర్‌ లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం కేసు నమోదు చేశారు.

గుర్తుతెలియని

వాహనం ఢీకొని..

యువకుడి మృతి

చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం పంచాయతీ కోటిగుంట గిరిజన కాలనీకి వెళ్లే ములుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వాదనాల మహేష్‌ (25) అనే యువకుడు శుక్రవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన మహేష్‌ వాకాడు మండలం బుసపాళెం గ్రామంలో తమ బంధువుల వద్దకు వెళ్లాడు. తిరిగి బస్సు ఎక్కేందుకు నడిచి వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొని తలపైకి ఎక్కింది. దీంతో తల ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారింది. మహేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. బుసపాళెంలోని బంధువుల ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాళెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

కారును ఢీకొట్టిన బైక్‌

ఒకరికి తీవ్రగాయాలు

కోవూరు: మండల కేంద్రమైన కోవూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. రామన్నపాళెం గ్రామానికి చెందిన నాగేంద్ర తన మోటార్‌బైక్‌పై నెల్లూరు వైపు నుంచి కావలి వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోవూరులోని బీపీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి వచ్చేసరికి, అదే దిశలో వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాగేంద్ర ఎగిరి రోడ్డుపై పడటంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

కండలేరులో

48.480 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 48.480 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, లోలెవల్‌ కాలువకు 200, హైలెవల్‌ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్‌ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement