● వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు
● మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక దువా
● ఈద్ – ఉల్ – ఫిత్ర్ నేడు
వినీలాకాశంలో నెలవంక శుక్రవారం రాత్రి కనిపించింది. ఈ విషయమై మతపెద్దల ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా ఈద్ – ఉల్ – ఫిత్ర్‌ను ఆనందోత్సాహాలతో శనివారం జరుపుకొనేందుకు ముస్లింలు సమాయత్తమయ్యారు. నెల రోజుల ఉపవాస దీక్షలను ప్రత్యేక ప్రార్థనలతో విరమించారు. నగరంలోని జెండావీధి, కోటమిట్ట తదితర ప్రాంతాల్లో బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకొని ఆత్మీయ ఆలింగనంతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నగరంలోని మసీదులు, ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. నెలవంక దర్శనంతో మసీదులు, ఈద్గాలు, గృహాల్లో దువా చేశారు.
నగరంలో సందడి
పండగకు అవసరమైన సామగ్రి, వస్త్రాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో నగరంలో సందడి నెలకొంది. ప్రధాన కూడళ్లు, వీధులు రద్దీగా మారాయి. – నెల్లూరు(బృందావనం)


