● మందుబాబులా లేక ఆ శాఖ బాధితులా?
● పోలీసులకు ఏఈ ఫిర్యాదు
పొదలకూరు: పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంపై శుక్రవారం మద్యం బాటిళ్లతో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. వరండాలో పగిలిన బాటిళ్లు పెద్ద సంఖ్యలో పడ్డాయి. ఇది మందుబాబుల పనా లేక బిల్లులు సకాలంలో చేయలేదన్న కోపంతో ఎవరైనా బాధితులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారా? అనే అనుమానాలున్నాయి. ఉదయం కార్యాలయ సమయంలో వచ్చిన ఏఈ మహేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ దాసు సంతకాలు చేశారు. ఏఈ మరుపూరుకు, వర్క్ ఇన్‌స్పెక్టర్ తోడేరుకు క్యాంపునకు వెళ్లారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వారు పదుల సంఖ్యలో బీరు, బ్రాందీ బాటిళ్లను కార్యాలయంపైకి విసిరారు. అంతటితో ఆగకుండా వరండాలో ఉన్న కుర్చీని విరగ్గొట్టి వెళ్లారు. ఈ కార్యాలయం పొదలకూరు – మనుబోలు మెయిన్‌రోడ్డు పక్కనే ఉంటుంది. ప్రహరీ పొడవునా దుకాణాలున్నాయి. పగటి వేళ జన సంచారం ఉంటుంది. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంపై దాడికి పాల్పడటం వింతగా ఉందని స్థానికులు అంటున్నారు. గృహ నిర్మాణ శాఖలో సకాలంలో బిల్లులు చేయకపోవడం లేదా పక్కాఇళ్లను మంజూరు చేయకపోవడం వంటి కారణాలతో ఎవరైనా ఈ దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల హౌసింగ్ కార్యాలయం ప్రహరీ దారి మూసివేయడం తదితర కారణాలతో కూడా ఇలాంటి ఘటన జరిగి ఉండొచ్చని చెప్పుకొంటున్నారు. ఏఈ మహేష్ పీడీ, ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి పొదలకూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.


