నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నాలుగు మండలాలు ప్రభావితమై.. 1297 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయ ఏడీఏ నర్సోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
● అనంతసాగరం మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 1071 మంది రైతులకు సంబంధించిన 914 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి.. 140 హెక్టార్లలో పూత దశలో ఉన్న పత్తి పంట దెబ్బతినిందని చెప్పారు.
● రాపూరు మండలంలోని ఓ గ్రామంలో 80 మంది రైతులకు సంబంధించిన 80 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
● కలువాయి మండలంలోని నాలుగు గ్రామాల్లో 26 మంది రైతులకు చెందిన 13 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతినిందని తెలిపారు.
● మర్రిపాడు మండలంలోని ఐదు గ్రామాల్లో 250 మంది రైతులకు సంబంధించిన 150 హెక్టార్లలో కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు నివేదికలను సిద్ధం చేశామని వివరించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జిల్లాలోని ఏ ప్రాంత రైతులకు నష్టం జరిగినా, అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.
● రాపూరు: మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయాధికారి సోమసుందర్ పరిశీలించారు. గాలీవాన, వడగండ్లతో గోనుపల్లిలోని వరి, మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేలా నివేదికను సమర్పించనున్నామని తెలిపారు.


