
మానసిక ఆరోగ్యం.. అవగాహన కీలకం
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
● నిర్లక్ష్యం చేస్తే మతిస్థిమితం కోల్పోవడం ఖాయం
● రోజూ వైద్యం కోసం వెళ్తున్న మూడు వేలమంది
● ఒత్తిడి, అవహేళనతో కుంగుబాటు
● ప్రాథమిక దశలో చికిత్సతో సాధారణ జీవితం
జిల్లాలో రోజూ సుమారు 15 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో మూడు వేల మంది రోగులు మానసిక సమస్యలతో డాక్టర్ల వద్దకు వైద్యం కోసం వెళ్తున్నారు. గతంలో నెల్లూరులో కేవలం ఇద్దరు మానసిక వైద్య నిపుణులుండగా ఇప్పుడు పదిమంది వరకు చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా పలువురు మానసిక వైద్య నిపుణులతో విభాగం ఉంది.
నెల్లూరు(అర్బన్): మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాడు. శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. చదువు పేరుతో విద్యార్థుల్లో విపరీతమైన ఒత్తిడి పెంచడం, ఉద్యోగులను టార్గెట్‌ల పేరుతో వేధించడం, సీ్త్రలకు పిల్లలు సకాలంలో పుట్టకపోతే తక్కువ చేసి చూడటం, కొన్ని శారీరక అనారోగ్యాలు, సామాజికంగా తక్కువ చేసి చూడటం.. ఇవన్నీ మనిషి మెదడుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏమి చేయలేమనే ఆత్మన్యూనత భావంతో అనేకమంది మానసిక రోగులుగా మారుతున్నారు. వీరికి సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాథమిక దశలోనే వైద్య చికిత్స చేస్తే కోలుకుంటారు. లేకుంటే జీవితం నరకప్రాయంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1992 నుంచి అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తోంది.
మానసిక ఒత్తిడే ప్రధాన కారణం
హడావుడి జీవితం, ఒత్తిడితో బతకడం నేటి సమాజంలో మామూలైంది. ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమై, సమస్య వచ్చినప్పుడు సరిదిద్దే పెద్దలు లేకపోవడంతో చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థి దశ నుంచే పోటీతత్వం పెరిగిపోయింది. ర్యాంక్‌ల పేరుతో ఇంట్లో తల్లిదండ్రులు, విద్యాలయాల్లో అధ్యాపకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆటపాటలు, ఆనందాల్లేవు. చదువు.. చదువు అంటూ ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల వనంతోపు సెంటర్‌లో ఓ కళాశాలలో రెండు నెలల్లోనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ప్రైవేట్ మెడికల్ కళాశాలలోనూ ఇలాగే జరిగింది. సామాజికంగా చిన్నచూపు చూస్తూ ఇబ్బంది పెట్టిన ఘటనలో కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కౌన్సెలింగ్ తప్పనిసరి. స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు యువతతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.
జిల్లాలో ఇలా..