
పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌శ్రీనివాసరెడ్డి
● జిల్లాలోని న్యాయమూర్తులకు
ఒక రోజు శిక్షణ
నెల్లూరు (లీగల్): కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలని ఏపీ హైకోర్టు జడ్జి, జిల్లా న్యాయపాలన వ్యవహారాల జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి కోర్టు హల్లో జిల్లా స్థాయి న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ సీ ప్రవీణ్‌కుమార్, జి. సీతాపతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ కోర్టుల్లో పెండింగ్ కేసులు, కేసుల సత్వర పరిష్కారానికి చర్యలపై న్యాయమూర్తులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. న్యాయమూర్తుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు గీత, సరస్వతి, తేజోవతి, శ్రీనివాసరావు, సోమశేఖర్, నికిత వోర, పలు కోర్టుల సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.
న్యాయమూర్తులకు ఘన స్వాగతం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు సీ ప్రవీణ్‌కుమార్, జి సీతాపతిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ ఘన స్వాగతం పలికారు. తొలుత జస్టిస్ శ్రీనివాసరెడ్డి కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత అని గుర్తు చేశారు. కోర్టు ఆవరణ సుందరీకరణలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ చేస్తున్న కృషిని జస్టిస్ శ్రీనివాసరెడ్డి అభినందించి సన్మానించారు.