
పేదల ఆరోగ్యానికి ఆపద
● రెండో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్
● ఇబ్బందుల్లో రోగులు
నెల్లూరు (టౌన్): పేదల ఆరోగ్యానికి ఆపద వచ్చి పడింది. ప్రభుత్వం ఏడాది కాలానికి పైగా ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)లకు బకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు వైద్య సేవలు నిలిపివేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు. ప్రతి ఆస్పత్రి వద్ద ఆరోగ్యశ్రీ కింద వేద్య సేవలు నిలిపివేశామని బ్యానర్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి స్పెషాలిటీ ఆస్పత్రులకు వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. రోగులు ఎంత బతిమాలాడినా ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించకపోవడంతో నిరాశ, నిస్పృహలతో వెనుతిరిగారు. జిల్లాలోని 35 నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉండగా 30 ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అరవింద్ కిడ్నీ వైద్యశాల అధినేత డాక్టర్ ఎస్‌వీఎల్ నారాయణరావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని, కనీసం చర్చలకు పిలవకపోవడం దారుణమన్నారు. బకాయిలు విడుదల చేసేంత వరకు సేవలు కొనసాగించే ప్రసక్తే లేదన్నారు.