
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
నెల్లూరు(క్రైమ్): సీఎం చంద్రబాబు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ అజిత 1,250 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ గురువారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చూడాలన్నారు. ప్రధాన కూడళ్లలో మూవబుల్ బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వీవీఐపీ వెళ్లే మార్గంలో వ్యతిరేక దిశలో వాహనాల కదలికల్ని పూర్తిగా నిరోధించాలన్నారు. అనంతరం ఆమె సీఎం పర్యటించే ప్రాంతాల్లో ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
నెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై గురువారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. గోధుమ రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేట సాగక.. పూట గడవక..
తోటపల్లిగూడూరు: మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఇబ్బందుల్లో ఉన్నారు. కోడూరు పంచాయతీలోని 8 మత్స్యకార గ్రామాలతోపాటు వెంకన్నపాళెం పట్టపుపాళెంలోని సుమారు 3 వేల మంది వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. కొంత కాలంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సముద్రంలోని మత్స్య సంపద దరికి చేరడం లేదు. దీంతో ఇప్పటి వరకు అంతంతమాత్రంగా సాగుతున్న వేట పూర్తిగా నిలిచిపోయే పరిసిత్థి ఏర్పడింది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. పోటు కారణంగా సముద్రం కాస్త ఉగ్రరూపంగా మారుతోంది. దీంతో వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు భయపడుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా చేపలు లభ్యం కాక ఖాళీ పడవులతో తిరిగి రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అనేకమంది తమ వేట సామగ్రి, పడవులను తీరంలో కట్టేసి ఇతర పనులను చూసుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు