లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌

Oct 10 2025 6:14 AM | Updated on Oct 10 2025 6:14 AM

లైట్స

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌

మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఎత్తుగడ

తన అనుయాయులకు కట్టబెట్టేందుకే స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌

మైపాడు రోడ్డును ఆక్రమించి దుకాణాల ఏర్పాటు

నేడు ప్రారంభించాల్సి ఉన్నా,

చివరి నిమిషంలో వాయిదా

చిరు వ్యాపారుల పొట్టగొట్టి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా మంత్రి నారాయణ అడుగులేస్తున్నారు. అనుకున్నదే తడవుగా మైపాడు గేట్‌ సెంటర్‌లో స్మార్ట్‌ స్ట్రీట్‌ పేరుతో కంటైనర్లలో దుకాణాలను ఏర్పాటు చేశారు. స్ట్రీట్‌ వెండింగ్‌ పేరుతో మున్సిపల్‌ నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించి షాపులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి గానూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరాన్ని తొలి దశలో ఎంచుకున్నారు. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో వీటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెప్తున్నా, టీడీపీ వారికే ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఆయన కలలను సీఎం చంద్రబాబు సాకారం చేస్తూ.. దీన్ని శుక్రవారం ప్రారంభించాల్సి ఉన్నా, వాయిదా పడింది.

సాక్షి ప్రతినిఽధి,నెల్లూరు: నగరాభివృద్ధిని విస్మరిస్తూ.. చిరు వ్యాపారుల పొట్టగొట్టి.. తమ్ముళ్ల జేబులు నింపుతూ.. కొత్త పథకాలతో తమ వారికి ఉపాధి కల్పించడంలో మంత్రి నారాయణ నూతన పోకడలను అవలంబిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణగా మైపాడు గేట్‌ సెంటర్‌లోని స్మార్ట్‌ స్ట్రీట్‌ నిలుస్తోంది. ఇంటికి అవసరమైన వస్తువులు ఒకే చోట లభించేలా.. వినియోగదారుల సౌలభ్యం కోసమంటూ దీన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యాపార సముదాయాలను మున్సి పల్‌ శాఖ ఆధ్వర్యంలో అప్పగించే యత్నాలను ప్రారంభించారు.

చిరు వ్యాపారులను చిదిమేస్తూ..

వాస్తవానికి నగరాల్లో వీధి వ్యాపారులు ఫుట్‌పాత్‌లపైనే బిజినెస్‌ను సాగిస్తుంటారు. అయితే వీరి పొట్టగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. స్ట్రీట్‌ వెండింగ్‌ పేరుతో మున్సిపల్‌ నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించి షాపులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో వీటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెప్తున్నా, అందుకు భిన్నంగా జరుగుతోంది.

తమ్ముళ్ల కళ్లలో ఆనందం కోసం..

గత ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నారాయణ గెలుపొందారు. ఆ సమయంలో ఓ టీమ్‌ను ఏర్పాటు చేసి మూడు నెలల పాటు జీతాలిచ్చారు. డివిజన్ల వారీగా వారితో ఎన్నికల పనులు చేయించుకున్నారు. అధికారంలోకి వస్తే తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామంటూ వారికి హామీనీ ఇచ్చారని టాక్‌. ఇంకేముంది పురపాలక మంత్రిగా బాధ్యతలను స్వీకరించాక స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ను తెరపైకి తెచ్చారు. నెల్లూరులోనే అయితే చెడ్డ పేరొస్తుందని భావించి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో అమలు చేసేందుకు యత్నించారు. టీడీపీ నేతలిచ్చిన జాబితా మేరకే దుకాణాలను కేటాయించేలా అధికారులను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసేవారు ఖాళీ చేయాలంటూ కమిషనర్‌ ద్వారా హెచ్చరికలూ జారీ చేయించారు.

బతుకుదెరువెలా..?

ప్రధాన నగరాల్లో స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ ఏర్పాటైతే వేలాది మంది చిరు వ్యాపారులు రోడ్డునపడే అవకాశం ఉంది. ఒక్క నెల్లూరులోనే ఫుట్‌పాత్‌లపై నాలుగు వేల మంది బిజినెస్‌ చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ తరుణంలో తమ పరిస్థితి ఏమిటాననే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది.

నాడు విస్తరిస్తే.. నేడు ఆక్రమిస్తున్నారు..!

వాస్తవానికి నగరంలోని పాత చెక్‌పోస్ట్‌ నుంచి వేణుగోపాల్‌నగర్‌ (చేపల మార్కెట్‌) వరకు మైపాడు రోడ్డును దాదాపు 2.7 కిలోమీటర్ల మేర రూ.20 కోట్లను వెచ్చించి.. 60 అడుగుల వరకు నాలుగు వరుసల రహదారిగా గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో విస్తరించారు. ఈ దారిలో నిత్యం దాదాపు 15 వేల వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. సిమెంట్‌ రోడ్లు, డివైడర్లలో పచ్చదనం, సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రహదారికి ఇరువైపులా వాకింగ్‌ ట్రాక్‌, పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలనూ సిద్ధం చేశారు. ఈ తరుణంలో ఎన్నికలు రావడంతో వీటికి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం రహదారికి ఇరువైపులా స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ పేరుతో 30 కంటైనర్లను పెట్టించి 120 మంది తెలుగు మహిళలకు మంత్రి నారాయణ అప్పగించారు.

సమర్పయామీ..

నెల్లూరులో స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ తెలుగు మహిళలకు లాభసాటిగా మారింది. ఒక్కో దుకాణానికి రూ.నాలుగు లక్షలను కేటాయించనున్నామని మంత్రి తెలిపారు. ఇందులో మెప్మా, కార్పొరేషన్‌ నుంచి రూ.రెండు లక్షలు.. మరో రూ.రెండు లక్షల రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. మొత్తమ్మీద ఎన్నికల్లో పనిచేసిన వారికి రూ.8.4 కోట్లను వెచ్చించారు.

ఎన్జీటీ నిబంధనలు బేఖాతర్‌

స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు కొన్ని నిబంధనలను అమలు చేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించినా.. మంత్రి, నగరపాలక సంస్థ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ అంశంపై ఎన్జీటీ దృష్టికి ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తీసుకెళ్లడంతో నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. పేరుకుపోయే చెత్త పక్కనే ఉన్న కాలువలో చేరి నీరు కలుషితమవుతుందని.. కాలువ పొరంబోకు స్థలాలు ఆక్రమణకు గురవుతాయనే వాదనతో ఏకీభవించింది. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపేసి, నిబంధనలు పాటించాకే ప్రారంభించాలని పేర్కొంది. భూగర్భ డ్రైనేజీని పూర్తి చేసి కాలువకు కంచె వేస్తే, ఆ తర్వాతే షాపుల ఏర్పాటుకు అనుమతిస్తామని తెలిపింది. మరోవైపు ఈ పనులు పూర్తి కావాలంటే మరో పదేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో ఎన్జీటీ మార్గదర్శకాలను పాటించకుండానే స్ట్రీట్‌ వెండింగ్‌ను హడావుడిగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతుండటం గమనార్హం.

బాబొస్తున్నారు.. సుందరంగా మార్చండి

మంత్రి నారాయణ ఆదేశాలు

పర్యటనలో హడావుడిగా నెల్లూరును చేర్చినా.. చివరి నిమిషంలో రద్దు

నెల్లూరు సిటీ: బాబొస్తున్నారు.. దుకాణ యజమానులు సిద్ధంగా ఉండండి.. సరుకులను సిద్ధం చేయండి.. స్మార్ట్‌ స్ట్రీట్‌ను శుభ్రం చేసి సుందరంగా మార్చండంటూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వెంకటాచలం మండలంలో పర్యటనకు సీఎం చంద్రబాబు శుక్రవారం రానున్నారు. ఇందులో భాగంగా తొలుత ఖరారు చేసిన రూట్‌మ్యాప్‌లో మైపాడు గేట్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ స్ట్రీట్‌ ప్రారంభోత్సవమే లేదు. అయితే బుధవారం సా యంత్రానికి దీన్ని మంత్రి ఖరారు చేశారు. మరో వైపు దుకాణ నిర్వాహకులు, ఆ ప్రాంతం ప్రారంభానికి సిద్ధంగా లేదు. ఈ తరుణంలో మంత్రి హడావుడిగా నెల్లూరు చేరుకొని ఆదేశాలు జారీ చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన రద్దవడంతో ఈ ప్రయాస వృథా అయింది.

హడావుడిగా శుభ్రం

మైపాడు గేట్‌ సెంటర్‌లోని స్మార్ట్‌ స్ట్రీట్‌ దుకాణాల వెనుక వైపు కాలువ మురికి కూపంలా మారింది. మురుగు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వచ్చేది. అయితే హడావుడిగా శుభ్రపర్చే యత్నాలను అధికారులు ప్రారంభించారు. అయినా అదే పరిస్థితి నెలకొంది. ఆయా దుకాణాల్లో ఫుడ్‌ కోర్టులున్న తరుణంలో తామక్కడ ఆహారాన్ని ఎలా తీసుకోగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అప్పటికప్పుడు చెట్లు ప్రత్యక్షం

మైపాడు గేట్‌ సెంటర్‌లోని డివైడర్ల మధ్యలో అప్ప టికప్పుడు చెట్లు గురువారం మొలిచాయి. ట్రాక్టర్లలో తీసుకొచ్చి నాటడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్నామొన్నటి వరకు దుమ్ము, ధూళిలో ఉన్న ప్రాంతం ఒక్కసారిగా సుందరవనంగా మారిపోయింది. ఈ శ్రద్ధ రోజూ ఉంటే ఎంతో బాగుండేదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

అక్కడ నో.. ఇక్కడ మాత్రం సై..!

నగరంలో హత్యలు, చోరీలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు.. నిందితులను త్వరితగతిన పట్టుకునే అంశంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నో చోట్ల ఇవి పనిచేయకపోయినా, వాటిని బాగుచేసే దిశగా చొరవ చూపని పాలకులు.. స్మార్ట్‌ స్ట్రీట్‌లో మాత్రం అన్ని దుకాణాలకు ఏర్పాటు చేయడం గమనార్హం.

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌ 1
1/2

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌ 2
2/2

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement