
హామీలతో మోసం.. టార్గెట్లతో భారం
సీహెచ్‌ఓలు తమకు జీతాలు పెంచాలని, ఇన్సెంటివ్స్ చెల్లించాలని కోరుతూ నాలుగు నెలల క్రితం సమ్మె బాట పట్టారు. 46 రోజులు సమ్మె చేశారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా ఇన్సెంటివ్స్ మొత్తం ఒకేసారి చెల్లిస్తామని, సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీతాలు పెంచే విషయం కూడా పరిశీలిస్తామని చెప్పి సమ్మె విరమింప చేసింది. అయితే హామీలకు విరుద్ధంగా సమ్మె చేశారంటూ ఒక్కో నెలలో రూ.5 వేలు చొప్పున రెండు నెలలకు రూ.10 వేలు జీతాలు కట్ చేసి మిగతా మొత్తాన్ని సీహెచ్‌ఓల ఖాతాలో జమ చేశారు. ఇన్సెంటివ్స్ మొత్తం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం చేతిలో మోసపోయి తక్కువ జీతాలతో పని చేస్తున్న తమను ప్రభుత్వం మోసగించడమే కాకుండా పీ4 కింద పేద కుటుంబాలను దత్తత తీసుకోమని పేర్కొనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.