సాగుకు గడ్డు పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

సాగుకు గడ్డు పరిస్థితి

Aug 3 2025 2:57 AM | Updated on Aug 3 2025 2:57 AM

సాగుకు గడ్డు పరిస్థితి

సాగుకు గడ్డు పరిస్థితి

కండలేరు పంపింగ్‌ స్కీమ్‌కు రిపేర్లు

ప్యానల్‌ బోర్డు మార్చేందుకు యత్నం

ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత కరువు

నీటి విడుదల వాయిదా

ప్యానల్‌ బోర్డు మార్చాలి

కండలేరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ నుంచి ఎడమ గట్టు కాలువకు నీటిని పంపింగ్‌ చేసేందుకు అంతా సిద్ధం చేశాం. అయితే హెవీ మోటార్లకు సంబంధించిన ప్యానెల్‌ బోర్డు ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో బోర్డును తెప్పించే యత్నాల్లో ఉన్నాం. సాధ్యమైనంత త్వరగా నీటిని పంపింగ్‌ చేయనున్నాం.

– విజయరామిరెడ్డి, తెలుగుగంగ డీఈ

పొదలకూరు: కండలేరు పంపింగ్‌ స్కీమ్‌కు రిపేర్లు తలెత్తడంతో దాదాపు 20 వేల ఎకరాల్లో సాగుకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి కండలేరు ఎడమ గట్టు కాలువకు పంపింగ్‌ స్కీమ్‌ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ తరుణంలో హెవీ మోటార్లకు విద్యుత్‌ను సరఫరా చేసే సబ్‌స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మరమ్మతులు చేయించారు. ఈ నేపథ్యంలో కాలువకు నీటిని పంపింగ్‌ చేసేందుకు శనివారం యత్నించగా, ప్యానల్‌ బోర్డులో ఏర్పడిన సాంకేతిక కారణాలతో వీలుపడలేదు. దీంతో బోర్డును పూర్తి స్థాయిలో మార్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

లభ్యంకాని సామగ్రి

ఒక్కో మోటార్‌ 2050 హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉంది. పంపింగ్‌ స్కీమ్‌కు ఉపయోగించే సామగ్రి ఈ ప్రాంతంలో లభ్యం కాదు. ఫలితంగా చైన్నె, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించాల్సి ఉంది. కండలేరు ఎడమ గట్టు హైలెవల్‌ స్లూయిజ్‌ ద్వారా నీటిని విడుదల చేసేందుకు కాలువను నిర్మించారు. అయితే స్లూయిజ్‌ ఎత్తులో ఉండటంతో కండలేరు జలాశయంలో 35 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంటేనే, గ్రావిటీ ద్వారా కాలువకు అందుతుంది. అయితే ప్రస్తుతం 26 టీఎంసీలే నిల్వ ఉంది.

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ నిర్మాణం

గ్రావిటీ ద్వారా ఎడమ కాలువకు నీరు అందకపోతే మెట్ట ప్రాంత రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా లోలెవల్‌ స్లూయిజ్‌ వద్ద లిఫ్ట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సుమారు 6.5 కిలోమీటర్ల మేర రెండు పైప్‌లైన్లను నిర్మించి ఎడమ కాలువకు కలిపారు. గ్రావిటీ ద్వారా నీరందని సమయంలో లిఫ్ట్‌ సిస్టమ్‌ ద్వారా లోలెవల్‌ స్లూయిజ్‌ నుంచి కాలువకు అందిస్తారు. అయితే లిఫ్ట్‌ ప్రక్రియ తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో అవసరాలకు నీటిని పంపింగ్‌ చేయలేకపోతున్నారు. సామగ్రిని తెప్పించేందుకు తెలుగుగంగ ఇంజినీరింగ్‌ అధికారులు తంటాలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement