
అధికారుల తీరుపై అసహనం
నెల్లూరు (పొగతోట): అంగన్‌వాడీ కేంద్రాలు, డీపీఆర్సీ భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేసి నెలలు గడుస్తున్నా, అధికారుల్లో స్పందన లేదని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. డీపీఆర్సీ భవనానికి అనుమతులను ఆర్నెల్ల క్రితం మంజూరు చేస్తే, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేదని చెప్పారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం చెప్తున్నా, ట్రాక్టర్‌కు రూ.నాలుగు వేలను చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన సినరైజ్ జెడ్పీకి రావడంలేదన్నారు. అయితే ఇసుక ఉచితం కావడంతో ఇది రాదని అధికారులు బదులిచ్చారు.
రీచ్‌కు ఎలా అనుమతిచ్చారు..?
కలువాయి మండలం రాజుపాళెంలో రీచ్‌కు ఎలా అనుమతిచ్చారంటూ మైనింగ్ శాఖ అధికారులను జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. 500 మీటర్ల పరిధిలో బోర్లుంటే అనుమతులను ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. తెలుగురాయపురం రీచ్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆదేశించారు. పీ4 పథకానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించాలన్నారు.
నిధులు మంజూరు చేసినా..
పనులు ప్రారంభించరా..?
ఇసుక ఫ్రీ అంటున్నా,
అధిక ధరలకు విక్రయం
జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ
అస్తవ్యస్తంగా జలజీవన్ మిషన్ పనులు
జలజీవన్ మిషన్ పనులు అస్తవ్యస్తంగా మారాయని ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగ తగలి పశువులు మరణించి ఆర్నెల్లవుతున్నా, బీమా అందలేదని, దీనిపై కలెక్టర్‌కు సమాచారమిచ్చినా నేటికీ స్పందన లేదని పేర్కొన్నారు. బెంగళూరు, చైన్నె నుంచి చికెన్ వ్యర్థాలు జిల్లాకు అధిక మొత్తంలో వస్తున్నాయని, వీటిని అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. అనంతరం ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖలపై సమీక్షించారు. సీఈఓ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.