
‘యాక్సిస్’ కుంభకోణంపై పోరాటం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో జరిగిన యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై దశల వారీగా పోరాటం చేస్తామని యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య స్పష్టం చేశారు. యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీలతో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై పోలీసులు నేటికీ విచారణ జరపలేదని, కారకులను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అమాయక గిరిజనుల పేరుతో ముత్తుకూరులోని బ్యాంక్‌లో రూ.కోట్లలో రుణాలు తీసుకోవడం దారుణమన్నారు. ఈ ఉదంతంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి దశలవారీగా న్యాయ, ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద నిరసనను సోమవారం చేపట్టనున్నామని పేర్కొన్నారు. సమగ్ర విచారణకు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌కు పిర్యాదు చేస్తామన్నారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామరాజు, ఏఆర్డీ చైర్మన్ బషీర్, రజక సంఘ నేతలు పద్మజ, పోలయ్య, రఘు, కోటయ్య, యానాదుల సంఘ నేతలు కృష్ణయ్య, రవీంద్రబాబు, ఉషా తదితరులు పాల్గొన్నారు..