మహిళలపైనా లాఠీచార్జి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా, ప్రజలు తిప్పికొట్టి విజయవంతం చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజిత తదితరులు విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. మాజీ సీఎం పర్యటనకు ప్రజలు రాకూడదనే దురుద్దేశంతో రోడ్లను తవ్వేయడం, జేసీబీలను అడ్డుపెట్టారని, ఇలాంటి పోకడలు దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు. నిర్బంధాలను అధిగమించి వేలాదిగా ప్రజలు వచ్చారని, జగనన్నకు ఉన్న ఆదరణ ఏ పాటిదో దీని ద్వారా తెలుస్తోందన్నారు.
జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారు
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారని, పోలీసులిచ్చే నోటీసులను సంతోషంగా స్వీకరిస్తామని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమ కేసులను బనాయించి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని జైలుకు పంపారని.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని చెప్పారు. వీరికి అండగా నిలిచేందుకు జిల్లాకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తుంటే, ఆయన్ను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని యత్నం లేదని విమర్శించారు. ఆయన పర్యటనపై జిల్లా వాసులే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారని తెలిపారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి ప్రసన్న నివాసం వరకు 7.7 కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారని వివరించారు. చెట్లు.. గుట్టలతో ఉన్న ప్రాంతంలో అనుమతిస్తే, ఐదు రోజులు శ్రమించి హెలిప్యాడ్‌కు స్థలాన్ని సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు. హెలిప్యాడ్, జైలు వద్ద పది మందికి మించి.. ప్రసన్న నివాసం వద్ద ఒక్కరూ ఉండకూడదని.. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మూడు వాహనాలకు మించి ఉండకూడదంటూ నిబంధన విధించారని, అయితే పోలీసులు మాత్రం 12 వాహనాల్లో వచ్చి ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. 35 రకాల కండీషన్లను పెట్టారని, ఎవరెవరు ఎక్కడెక్కడుంటారో జాబితా.. వాహనాల నంబర్లను ముందే ఇవ్వాలన్నారని, ఇదెక్కడి చోద్యమో అర్థం కావడంలేదని చెప్పారు. తమ పార్టీకి చెందిన మూడు వేల మంది నేతలకు నోటీసులిచ్చారని ధ్వజమెత్తారు. కార్యక్రమానికి ఎవర్నైనా తీసుకెళ్తే కేసు లు పెడతామని బెదిరించారని, పార్టీ మహిళా నేతల ఇళ్లకు మహిళా కానిస్టేబుళ్లు లేకుండా అర్ధరాత్రి వెళ్లి నోటీసులను ఇచ్చారని మండిపడ్డారు. కార్యకర్తలు రాకుండా రోడ్లను బారికేడ్లతో నిర్బంధించి దాదాపు మూడు వేల మంది పోలీసులను మోహరించారని, జగన్‌మోహన్‌రెడ్డికి రక్షణ కల్పించాల్సింది పోయి అడ్డుకునేందుకే ఆసక్తి చూపారని విమర్శించారు.
కార్యకర్తలు వెనుకడుగేయలేదు
జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానానికి నెల్లూరు పర్యటన ఓ ఉదాహరణ అని ఆనం విజయకుమార్‌రెడ్డి, మేరిగ మురళి పేర్కొన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాఠీచార్జి చేసినా, తమ కార్యకర్తల మనోధైర్యం చెక్కుచెదరలేదని తెలిపారు. ప్రజాభిమానాన్ని చూసి కూటమి నేతలు ఓర్వలేక మీడియా ద్వారా వారి అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.
జగనన్న భరోసా ఎంతో ధైర్యాన్నిచ్చింది
కష్టాల్లో ఉన్న తమ కుటుంబానికి జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని కాకాణి పూజిత పేర్కొన్నారు. దీనిపై కొన్ని పత్రికలు వక్రీకరించాయని, వారిని ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని, అక్రమ కేసులతో జైల్లో నిర్బంధించారనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.
నిర్బంధాలను అధిగమించి
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
మాజీ సీఎం జగన్ పర్యటన
గ్రాండ్ సక్సెస్
విలేకరులతో వైఎస్సార్సీపీ నేతలు
తమ పార్టీ నేతలు, కార్యకర్తలను హోమ్ మంత్రి, డీజీపీ, ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో నిర్బంధించారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. ఏడాది పాలనకే చంద్రబాబులో భయం మొదలైందని విమర్శించారు. పోలీసులు ఖాకీ చొక్కాలను తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తల తరహాలో వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఒంగోలుకు చెందిన ఓ పోలీస్ తనపై లాఠీతో దాడి చేసి, గోళ్లతో రక్కి.. తిరిగి తనపైనే రెండు కేసులు పెట్టారని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రెస్ మీట్‌ను అడ్డుకునేందుకు పార్టీ కార్యాలయంపైకి టీడీపీ గూండాలను పంపారని, అయినా తాము ఆగిపోలేదని చెప్పారు.