
వైఎస్సార్‌సీపీ పాలనలో ఇచ్చిన రైతు భరోసా
నాడు
నేడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్
నెల్లూరు(పొగతోట): కూటమి అధికారంలోకి వచ్చి అన్నదాతల ఆశలను చిదిమేసింది. ఆరుగాలం పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ పథకంతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేసి తొలి ఏడాదిలోనే హామీని తుంగులో తొక్కేశారు. తాజాగా పీఎం కిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14 వేలను మూడు విడతల్లో ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
నిబంధనల కొర్రీలు..
లబ్ధిదారుల సంఖ్యలో కోతలు
అన్నదాతకు కూటమి ప్రభుత్వం గుండెకోత పెట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా పథకంలో లబ్ధిదారులుగా ఉండి లబ్ధి పొందిన రైతుల్లో 28,299 మందిని తొలగించారు. ఈకేవైసీ, ఆధార్‌లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులను అనర్హులుగా ప్రకటించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2,14,667 మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అందజేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లా వ్యాప్తంగా 3.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత అర్హులైన రైతులు 1,98,514 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు స్వయంగా జిల్లా వ్యవసాయ అధికారిణి గత నెల 23న పత్రిక ప్రకటన విడుదల చేశారు. తాజాగా అధికారులు 1,86,368 మందిని అర్హులుగా తేల్చారు. కేవలం వారం రోజుల్లోనే ఫైనల్ చేసిన జాబితాల నుంచి 12,146 మంది లబ్ధిదారులను లేపేశారు.
వైఎస్సార్ రైతు భరోసా పథకం..
వైఎస్ జగన్ బ్రాండ్
చంద్రబాబు గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏనాడు అన్నదాతల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఆర్థికంగా ఆదుకున్నది లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి సారి రైతులను వంచనకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. 2004కు ముందు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయమే దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని నిలువునా మోసం చేశారు. తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవ పథకంగా మార్పు చేసి ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం వైఎస్ జగన్ బ్రాండ్‌గా చెప్పొచ్చు.
సంవత్సరం మొత్తం ఆర్థిక సాయం
రైతులు (రూ.కోట్లల్లో)
2019–20 2,02,306 273.11
2020–21 2,43,502 328.72
2021–22 2,43,911 329.27
2022–23 2,14,667 289.80
2023–24 2,14,667 289.80
నెల్లూరురూరల్: రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నారని కలెక్టర్ ఓ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ మొత్తం 1,95,866 మంది అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. తొలివిడతలో 1,86,146 మందికి నిధులు విడుదల చేస్తున్నామని, మిగిలిన అర్హులైన లబ్ధి దారులు ధ్రువీకరణ పత్రానలు అందజేస్తే వారికి సైతం నిధులిస్తామని తెలిపారు. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.రెండు వేల చొప్పున జమ చేయనున్నాయని చెప్పారు.