
నిధుల గోల్‌మాల్
సీతారామపురం: మండలంలో విధులు నిర్వర్తిస్తూ దీర్ఘకాల సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ ఏకంగా రూ.11 లక్షలకుపైగా నిధులను స్వాహా చేశారనే చర్చ మండలంలో కొన్ని రోజులుగా జరుగుతోంది. గతేడాది అక్టోబర్ 4న విధుల్లో చేరిన సదరు అధికారి.. ప్రభుత్వ నిధులకు సంబంధించి ఎలాంటి లెక్కల్లేకుండా తన అనుచరులతో డ్రా చేయించారని తెలుస్తోంది. స్థానిక కెనరా బ్యాంక్‌లో గల ఎంపీడీఓ పెన్షన్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని డ్రా చేయించారని సమాచారం. ఆయన విధుల్లో చేరాక పెన్షన్ అకౌంట్‌కు పలు విడతలుగా ట్రైనింగ్ డబ్బులు సుమారు రూ.1.6 లక్షలు.. 15వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన పనుల నుంచి మినహాయించిన రికవరీ మొత్తాలు సుమారు రూ.మూడు లక్షలను బదిలీ చేయించి.. చెల్లించకుండానే వాటిని స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు గుండుపల్లి వద్ద నేషనల్ హైవే పనుల్లో భాగంగా పాఠశాల, పంచాయతీ భవనంతో పాటు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు కలెక్టర్ మంజూరు చేసిన నష్టపరిహారం రూ. 39,42,534 జమయ్యాయి. వీటిని ఉన్నతాధికారుల ఆదేశానుసారం వినియోగించాల్సి ఉన్నా, అందులో రూ.ఆరు లక్షలను బొక్కేశారని సమాచారం. కాగా ఈ విషయమై కార్యాలయ ఏఓను సంప్రదించగా, నగదు లావాదేవీలను ఎంపీడీఓ స్వయంగా చూసేవారని, సిబ్బంది ప్రమేయం లేదని బదులిచ్చారు.
సీతారామపురం
ఎంపీడీఓ కార్యాలయం
నేషనల్ హైవే నష్టపరిహారం,
కాంట్రాక్ట్ పనుల రికవరీ సొమ్ము
రూ.11 లక్షలకుపైగా స్వాహా
దీర్ఘకాల సెలవుపై వెళ్లిన ఎంపీడీఓపై ఆరోపణలు