
ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు : కలెక్టర్
నెల్లూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన రహదారులు, బ్రిడ్జి నిర్మాణాలు, ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ, భూసేకరణ, జల్‌జీవన్ మిషన్ పనులపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించి వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి సాగునీటి కాలువల మరమ్మతులు, ఇతర పనులు వేగవంతం చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం కూడా త్వరగా చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీహెచ్‌సీ భవనాలు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాల భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతినెలా ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సమీక్షిస్తానని, సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. సమావేశంలో సోమశిల, తెలుగుగంగ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, దేశ్‌నాయక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.