
నగరం దిగ్బంధం
జగన్ పర్యటనపై నిఘా నేత్రం
● 891 మందితో పోలీసుల బందోబస్తు
● జగన్ భద్రత కోసమా..
అభిమానుల కట్టడి కోసమా?
నెల్లూరు (క్రైమ్): మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు నెల్లూరు నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు. 891 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు అడుగడుగునా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందుకు తగిన విధంగా భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకే అనేది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సత్యసాయి జిల్లా రాప్తాడు నుంచి, ప్రకాశం జిల్లా పొదిలి, గుంటూరు మిర్చియార్డు, పల్నాడు జిల్లా రెంటళ్లపాడు, చిత్తూరు జిల్లా పూతలపట్టులోని బంగారుపాళ్యంలో పరిస్థితులు అందుకు అద్దాం పట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పోలీసులు పటిష్ట భద్రత కల్పించామని చెప్పినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. కేవలం ప్రజలను, వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునే పనుల్లోనే పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదే తరహాలో నెల్లూరులోనూ పోలీసు అధికారులు వ్యవహరించనున్నారనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని, ప్రజలు గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జనసమీకరణ చేసినా, ప్రదర్శనలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మందికిపైగా వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు అందజేశారు. ఆంక్షలను దాటి వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలను అడ్డుకునేందుకు ఈ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు (బృందావనం): మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి బుజబుజనెల్లూరు మీదుగా నెల్లూరు నగరంలో సుజాతమ్మకాలనీలో ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వరకు సీసీ కెమెరాల ఏర్పాటు వెనుక ప్రభుత్వం, పోలీసుల కుట్రలు ఉన్నాయని స్పష్టవుతోంది. ఇదంతా వైఎస్ జగన్ భద్రత పర్యవేక్షణ కోసం అనుకుంటే పొరపాటే. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున కుట్రలు చేసిన ప్రభుత్వం పోలీసులతో ఆంక్షలు, అడ్డంకులతో కుతంత్రానికి తెరతీసింది. ఆయన పర్యటనకు ఎవరూ రావొద్దంటూ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు నోటీసులు జారీ చేశారు. ఆంక్షలు అతిక్రమించి వస్తే అక్రమ కేసుల నమోదు చేయడానికే నిఘా కెమెరాలు ఏర్పా టు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఈ మార్గాల్లో రాకపోకలు సాగించే వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్ నగర్ నుంచి బుజబుజనెల్లూరు వైపు నుంచి కేంద్ర కారాగారానికి దారి తీసే మార్గంలో వాహనాలు, ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు కేంద్ర కారాగారానికి సుమారు 500 మీటర్ల దూరంలో బారికేడ్లు సిద్ధం చేశారు.