
అగ్నికి ఆహుతైన గానుగ మిల్లు
సంగం: గానుగ మిల్లు మంటల్లో కాలిపోవడంతో రూ.10 లక్షల నష్టం వాట్లింది. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు ఇలా చేశారని మిల్లు యజమాని వెంకటరమణయ్య మంగళవారం సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. మండలంలోని పడమటిపాళెం పల్లిపాళేనికి చెందిన ఇండ్ల వెంకటరమణయ్య గ్రామ మాజీ సర్పంచ్. వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడికి రాజగోపాల్ అనే కుమారుడు ఉన్నాడు. గ్రామ సమీపంలోనే నాలుగేళ్ల క్రితం వేరుశనగ ఆడించే మిల్లును సుమారు రూ.7 లక్షలతో పెట్టారు. తండ్రీకొడుకులు సోమవారం రాత్రి మిల్లును చూసి ఇంటికెళ్లారు. అర్ధరాత్రికి మిల్లు మంటల్లో కాలిపోతుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు వివాహానికి వెళ్లొస్తూ గమనించి వెంటనే బాధితులకు తెలియజేశాడు. వారు మరో 10 మందితో వచ్చి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మిల్లు పైనున్న రేకును తొలగించి పెట్రోల్ పోసి తగులబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నాడు. లోపల రెండు డ్రమ్ముల్లో ఉన్న 300 కిలోల నూనె, 20 బస్తాలు వేరుశనక్కాయలు, వేరుశనగ చెక్కు, గానుగ మెషినరీ కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల మే ఆస్తినష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. సంగం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.10 లక్షల ఆస్తి నష్టం
అక్కసుతో పెట్రోలు పోసి తగులబెట్టారు
పోలీసులకు బాధితుల ఫిర్యాదు

అగ్నికి ఆహుతైన గానుగ మిల్లు