
మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత
నెల్లూరు (క్రైమ్): పారిశుధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి తమ కడుపులు కొట్టొదంటూ గడిచిన 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం ఉద్రిక్తంగా మారింది. నిప్పో, అయ్యప్పగుడి ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులతో అధికారులు పారిశుధ్య పనులు చేయిస్తున్నారన్న సమాచారం అందుకున్న మున్సిపల్ కార్మికులు అక్కడికి చేరుకుని తమ పనులను ఇతరులతో చేయిస్తే సహించమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు అధికారులను కోరారు. తామెదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తూ సహకరించాలని ప్రైవేట్ వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న వేదాయపాళెం పోలీసులు కార్మికులతో దురుసుగా ప్రవర్తించారు. మహిళలను మగ పోలీసులు ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆడ పోలీసులు లేకుండా ఎలా ఈడ్చుకెళ్తారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహావేశాలతో పోలీసులు జీపుల్లో ఎత్తిపడేసి వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీరితోపాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రూరల్ అధ్యక్షుడు దేశమూర్తితోపాటు పలువురిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికులు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు పరిస్థితి జఠిలం కావడంతో ఆందోళ కారులపై లాఠీచార్జి చేయడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కొందరు మహిళ కార్మికులను స్టేషన్‌లోకి తీసుకెళ్లి నిర్బంధించారు. మరి కొన్ని ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్న కార్మికులు స్టేషన్ వద్దకు చేరుకుని బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, మరికొందరు నేతలు, కార్మికులతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారు వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసరావుతో చర్చించారు. స్టేషన్‌లో ఉన్న కార్మికులందరిని సొంత పూచీకత్తుపై బయటకు తీసుకువచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ఇన్‌స్పెక్టర్ దురుసుగా వ్యవహరిస్తూ లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికలందరూ దళితులు, గిరిజనులని వారిపై ఇలా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి నిర్భందాలు పెట్టడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.
ప్రైవేట్ వ్యక్తులతో పనిచేయిస్తుండగా అడ్డుకున్న రెగ్యులర్ కార్మికులు
వారిపై పోలీసుల దురుసు ప్రవర్తన
మర్యాదగా మాట్లాడాలనడంతో
ఆగ్రహంతో లాఠీచార్జి
పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో నిర్బంధం
పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన కార్మికులు