
న్యాయశాఖ ఉద్యోగాల సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు (లీగల్): జిల్లా న్యాయశాఖ ఉద్యోగాల సంఘ ఎన్నికలు సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయశాఖ ఉద్యోగుల కార్యలయంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పీవీ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటసునీల్, ట్రెజరర్ ఎస్‌కే షఫీ, అసోసియేట్ ప్రెసిడెంట్ వి.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.దీపక్, గౌరవ అధ్యక్షుడిగా బి.శివయ్య, ఉపాధ్యక్షులుగా ఎస్.శివయ్య, సీహెచ్ బాలయ్య, శివప్రసాద్ బాబు, సీహెచ్ వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా బి.సురేంద్రబాబుతో పాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
నేడు పీఎంశ్రీ స్కూల్
వర్చువల్‌గా ప్రారంభం
నెల్లూరు(టౌన్): జాతీయ విద్యా విధానంలో భాగంగా జిల్లాలో పీఎంశ్రీకు ఎంపికై న కలిగిరిలోని ఏపీ మోడల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన అధునాతన వసతులను మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రదాన్ వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 46 పాఠశాలలు పీఎంశ్రీకి ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం అధునాతన ల్యాబ్, డిజిటల్ తరగతులు, క్రీడామైదానం తదితర వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కలిగిరి ఏపీ మోడల్ స్కూల్‌లో ఈ వసతులు ఏర్పాటు చేయడంతో ఆ స్కూల్‌ను మంత్రి ప్రారంభించనున్నారు.
ఎంపీటీసీ ఎన్నికలకు
నోటిఫికేషన్ విడుదల
● ఆగస్టు 12న పోలింగ్,
14న కౌంటింగ్ ప్రక్రియ
విడవలూరు: విడవలూరు బిట్–2 ఎంపీటీసీగా, ఎంపీపీగా ఉన్న భవానమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఖాళీ అయిన ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ను విడదల చేసింది. ఈ ఎన్నికలకు కోవూరు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.మోహన్‌రావును రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు రిటర్నింగ్ అధికా రులుగా కొడవలూరు ఎంపీడీఓ నగేష్ కుమారి, తహసీల్దారు చంద్రశేఖర్‌ను నియమించారు.
షెడ్యూల్ ప్రక్రియ
షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడానికి గడువు. 2వ తేదీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. అదే రోజు తిరస్కరించిన నామినేషన్లపై ఆర్డీఓ ఎదుట సాయంత్రం 5 గంటల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం. 4వ తేదీ అప్పిలేట్ అథారిటీ అప్పీల్ పరిష్కారం. 5వ తేదీ నామినేషన్లు 3 గంటల లోపు ఉపసంహరణ, అదే రోజు పోటీలోని అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ. ఆగస్టు 12వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. 13వ తేదీ అవసరమైతే రీ పోలింగ్ నిర్వహించాలని, 14వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది.