
చాపల్లేవ్.. దుప్పట్లు ఇవ్వలే..
ప్రభుత్వ హాస్టళ్లు
నెల్లూరు: బందెల దొడ్డిలా.. చిన్న గదిలో పది మందికిపైగా విద్యార్థులను కుక్కిన నెల్లూరులోని ఎస్సీ బాలుర వసతి గృహం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు నరకప్రాయంగా మారాయి. పేద వర్గాల విద్యార్థుల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని, వీరంతా బాగా చదువుకోవాలని సర్కారు నిర్వహించే సంక్షేమ వసతి గృహాల ఉద్దేశం పాలకు ల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తున్నాయి. నరక కూపానికి నకళ్లుగా కనిపించే హాస్టళ్లల్లో విద్యార్థుల భవిష్యత్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లపై ప్రభుత్వం చేసే ప్రచారానికి భిన్నంగా ఉన్నాయి. హాస్టళ్ల భవనాలు పలుచోట్ల మరమ్మతులకు గురికావడంతో వాటిని మూసేశారు. ప్రైవేట్ భవనాల్లో హాస్టళ్లు ఉండడంతో మరమ్మతులకు నోచుకోవడంలేదు. హాస్టళ్లకు ఉపయోగపడని వంట పాత్రలను కాంట్రాక్టర్ల ద్వారా ఇప్పించారు. వీటిని ఉపయోగించలేక ఎస్సీ హాస్టల్ వార్డెన్లు మూలనడేశారు.
బాధ్యతలో నిర్లక్ష్యం
జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతిగృహాలు 162 ఉండగా, ఇందులో 11,864 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యా సంవత్సరంలో హాస్టళ్లు ప్రారంభమై నెల దాటిపోయినా అంతంత మాత్రం ఏర్పాట్లతో హాస్టళ్లను నిర్వహించాల్సి వస్తోంది. పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఎంతో వారికి నెల వారీగా ఇచ్చే మెనూ బిల్లులు, కాస్మోటిక్ చార్జీల చెల్లింపుల్లోనే కనబడుతోంది. హాస్టళ్లను మరమ్మతులు చేశాం. బాగా చేర్పించండి అని ప్రచారం చేస్తున్నా.. కానీ హాస్టళ్లలో ఈ సంవత్సరం అంతగా విద్యార్థులు చేరడం లేదు. దానికి కారణం హాస్టళ్లలో దారుణమైన దుర్భరమైన పరిస్థితులే. జిల్లా వ్యాప్తంగా హాస్టళ్ల భవనాలు పలు మరమ్మతులకు రావడంతో పలు చోట్ల హాస్టళ్లను మూసివేశారు. కొన్ని చోట్ల హాస్టళ్లను మార్చారు. మరుగుదొడ్లు, స్నానపు గదుల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది.
అసౌకర్యాల వసతులు
జిల్లాలో ఉన్న 162 హాస్టళ్లల్లో 98 శాతం బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. పెచ్చులూడిపోయి ఎప్పుడు కూలిపోదామని ఎదురు చూస్తున్న కనిపించే భవనాల శ్లాబులు, కనీసం సున్నానికి కూడా నోచుకోని, వర్షానికి కారిన నీటి చారికలతో పాచిపట్టిన గదుల గోడల మధ్యనే చదువు, నిద్రతో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇక విద్యార్థులు స్నానం చేసేందుకు ప్రత్యేక గదుల సంగతి అటు ఉంచితే.. కనీసం మరుగుదొడ్లు దుర్భరానికి కేరాఫ్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని మరుగుదొడ్లకు డోర్లు ఉండవు, ఉన్నా.. అవి ఊడిపోయి ఉంటాయి. దొడ్లుల్లో కనీసం ఒకటి.. రెండు కాలకృత్యాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బక్కెట్లతో పట్టుకెళ్తున్న పరిస్థితి ఉంది. కొన్ని మరుగుదొడ్లపై శ్లాబులు కానీ, రేకులు కూడా లేని దుస్థితి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు ఉపయోగపడని వంట పాత్రలను కాంట్రాక్టర్ల ద్వారా ఇప్పించారు. అంత పెద్ద వంట పాత్రలను ఉపయోగించలేక ఎస్సీ హాస్టల్ వార్డెన్లు మూలన పెట్టేశారు.
మూతపడిన పలు హాస్టళ్లు
జిల్లాలో అనేక హాస్టళ్లను ఈ విద్యా సంవత్సరంలో మూసివేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండేందుకు ఇష్టపడని విద్యార్థులు అడ్మిషన్లు రద్దు చేసుకుని వెళ్లిపోవడంతో మరమ్మతులు చేయించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో మూతవేయక తప్పలేదు. ప్రైవేట్ భవనాలు దొరికితే అందులో కొనసాగిస్తామంటూ చెబుతూ కాలయాపన చేస్తున్నారు. పలు ప్రభుత్వ భవనాల్లో ఉన్న హాస్టళ్లకు వేసవి సెలవుల్లో మరమ్మతులు చేయించారు. అవి విద్యార్థులు ఉండేందుకు కంటే కాంట్రాక్టర్లు లాభపడేందుకే పనికొస్తున్నాయి. హాస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో ఉండడం, వాటి మరమ్మతులకు నోచుకోవడం లేదు.
సంఖ్య విద్యార్థులు
ఎస్సీ 69 4,972
బీసీ 79 3,994
ఎస్టీ 14 2,898
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇవ్వాల్సిన చాపలు, దుప్పట్లు కూడా ఇంత వరకు ఇవ్వలేదు. ఇక వారికి ఏటా అందించే పెట్టెలు కూడా అందించకపోవడంతో తుప్పు పట్టిన పాత పెట్టెలను వాడుకుంటూ విద్యార్థులు కాలాన్ని నెట్టుకొస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో అయితే విద్యార్థులకు ఇవ్వాల్సిన ట్రంకుపెట్టెలు గదుల్లో మూలన పడేసి ఉండడం గమనార్హం. జిల్లాలో ఏ ఒక్క హాస్టల్‌లో పడుకోవడానికి మంచాలు లేవు. పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు పెట్టెలు, దుప్పట్లు, చాపలు అన్ని వారే తెచ్చుకోవాలి. ప్రీమెట్రిక్ హాస్టల్‌లో దుప్పట్లు, పెట్టెలు ఇస్తారు. కానీ ఈ ఏడాది ఇంత వరకు సగం హాస్టళ్లలో కూడా ఇవ్వలేదు.

చాపల్లేవ్.. దుప్పట్లు ఇవ్వలే..