
కరేడు చుట్టూ పోలీస్ ఆంక్షలు
ఉలవపాడు: కరేడు, ఉలవపాడులో పోలీస్ ఆంక్షలు అమలవుతున్నాయి. శనివారం గిరిజనుల అరెస్ట్, ఆపై పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఆదివారం గ్రామాల్లో భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఉలవపాడు నుంచి కరేడు గ్రామానికి వెళ్లే అలగాయపాళెం రోడ్డు, దర్గా సెంటర్, హైవేలోని కరేడు ర్యాంపు వద్ద పికెట్ పెట్టారు. కరేడుకు కొత్త వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా తనిఖీలు చేస్తున్నారు. గ్రామంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో పోలీసుల్ని పెట్టారు. ధర్నా నిర్వహించిన తర్వాత ఆయా గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలని, గ్రామస్తులతో మాట్లాడాలని కొన్ని ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిర్ణయించారు. అయితే వారెవరూ గ్రామాల్లోకి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆపేస్తున్న పోలీసులు
సీపీఎం నాయకుడు కుమార్ కరేడు వెళ్తారనే సమాచారంతో ఆదివారం ఉదయం కందుకూరులోనే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఉంచి సాయంత్రం పంపించారు. స్థానికంగా ఉన్న వైఎస్సార్‌సీపీ, కందుకూరు నుంచి నాయకులు రాకుండా ఆపేస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యమం పెరుగుతుందనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈనెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. కందుకూరు సబ్ డివిజన్ పరిధి మొత్తం అమలులో ఉంటుందని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలియచేశారు. కరేడు ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, బయట వ్యక్తుల జోక్యంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నలుగురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్సైలతోపాటు సుమారు 200 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.
వెంకటాచలంలో అడ్డగింత
వెంకటాచలం: కరేడుకు వెళ్తున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను వెంకటాచలం పోలీసులు ఆదివారం ఉదయం టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. ఆ గ్రామంలో శాంతిభద్రతల సమస్య ఉందని, అనుమతించేది లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొంతసేపు వాదనలు జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఒప్పుకోకపోవడంతో రామచంద్ర యాదవ్ వెళ్లిపోయారు. ఆయన మాట్లాడుతూ కరేడు రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు.
సభలు, సమావేశాలు పెట్టొద్దని ఆదేశాలు
నాయకులు వెళ్లకుండా చర్యలు

కరేడు చుట్టూ పోలీస్ ఆంక్షలు