
పెద్దాస్పత్రిలో పరిశీలిస్తే..
నెల్లూరు(అర్బన్): హెపటైటిస్ వైరస్ గురించి చాలామందికి తెలియదు. కామెర్లు (పసిరికలు) అంటే అర్థమవుతుంది. హెపటైటిస్ వైరస్‌లు శరీరంలోని అతి పెద్ద గ్రంధి అయిన లివర్ (కాలేయం)పై పెనుప్రభావాన్ని చూపుతాయి. ప్రధానంగా ఐదు రకాలున్నా వాటిలో పైకి కామెర్లు రూపంలో కనిపించే ఏ రకం వైరస్ అంత ప్రమాదకరం కాదు. వైద్యుల సలహాలు తీసుకుని మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా రక్తంలోనే జీవితాంతం ఉండే హెపటైటిస్ బీ, సీ వైరస్‌తోనే ముప్పు ఉంటుంది. లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రస్తుతం ఇవి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి ఈ వ్యాధిని అంతం చేయాలని పిలుపునిచ్చింది. ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీని ప్రపంచ వైరల్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పెరుగుతున్న కేసులు
జిల్లాలో హెపటైటిస్ బీ, సీ రకం కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సీనియర్ డాక్టర్ల అంచనా మేరకు 25 వేల మందికి పైగా రోగులున్నట్టు తెలుస్తోంది. బీ, సీ వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉన్నవారి వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అలాగే రక్త మార్పిడి, ఒకే నీడిల్ కలిగి ఉన్న సిరంజ్‌తో మత్తు ఇంజెక్షన్లు వినియోగించే యువతలో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. అతిగా మద్యం సేవించే వారిలో ఆల్కాహాలిక్ హెపటైటిస్ బారిన పడుతున్నారు. మురికివాడలు, డయాలసిస్ కేసులు, హెచ్‌ఐవీతో బాధపడే వారిలో ఎక్కువగా బీ, సీ వైరస్ కనిపిస్తోంది. కొంతమందిలో తల్లి నుంచి బిడ్డకు సోకుతోంది.
స్క్రీనింగ్ పరీక్షలెక్కడ?
ఈ జబ్బు గురించి వైద్యశాఖలో లెక్కల్లేవు. జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా, నెల్లూరు నగరంలో ప్రభుత్వ పెద్దాస్పత్రి ఉన్నాయి. సర్వజన ఆస్పత్రిలో అరకొరా మినహా ఇక ఎక్కడా స్క్రీనింగ్ పరీక్షలు చేయడం లేదు. ఆపరేషన్ సందర్భాలతోపాటు డయాలసిస్, హెచ్‌ఐవీ రోగులు, ఖైదీలు జీజీహెచ్‌కు వచ్చినప్పుడు పరీక్షలు చేస్తున్నారు. ఇంకా ప్రజలు స్వచ్ఛందంగా కోరితే సరే. ఆస్పత్రిలో హెపటైటిస్‌కు వైరల్ లోడ్ పెరగకుండా చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఉచితంగా ఇక్కడ సేవలు పొందవచ్చు.
పెద్దాస్పత్రిలో హెపటైటిస్ – బీకి సంబంధించి 2022లో 14,684 మందికి పరీక్షలు చేస్తే వారిలో 205 మందికి, 2023లో 21,837 మందికి గానూ 404కి మందికి పాజిటివ్ వచ్చింది. 2024 జనవరి నుంచి జూలై వరకు 13,405 మందికి పరీక్షలు చేయగా 262 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. అలాగే సీ – వైరస్‌కు సంబంధించి 2022 నుంచి 2024 జూలై వరకు 31 వేల మందికి స్క్రీనింగ్ చేయగా 73 మందికి పాజిటివ్ వచ్చింది. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి 2023, 2024లో 93 మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 13 మందికి సీ వైరస్ ఉన్నట్టు తేలింది. మరో ముగ్గురికి బీ వైరస్ సోకింది. 7,961 మంది ఏఆర్‌టీ రోగులకు పరీక్షలు చేయగా 224 మందికి హెపటైటిస్ బీ సోకింది. 2024లో 388 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా వారిలో నలుగురికి బీ వైరస్ ఉన్నట్టు తేలింది.