
కొరవడిన నిఘా
నెల్లూరు సిటీ: నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్లలో నిఘా కొరవడింది. ప్రయాణికుల రద్దీ ఉండే చోట సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా జేబుదొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొన్ని కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. మరికొన్నింటిని దుకాణాల వైపు తిప్పి పెట్టారు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమైంది.
కొన్ని మాత్రమే..
నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో 12 సీసీ కెమెరాలుండగా అందులో 8 పనిచేస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్టాండ్‌లో 9 కెమెరాలుండగా 6 పనిచేస్తున్నాయి. ఈ రెండు డిపోల పరిధిలో నిత్యం 20 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికులు పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులు గ్రామాల నుంచి వందల సంఖ్యలో నెల్లూరుకు వస్తుంటారు. వారి భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది.
తూతూమంత్రంగా..
వేల సంఖ్యలో ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే బస్టాండుల్లో స్థానిక పోలీసుల పర్యవేక్షణ 24 గంటలూ ఉండాలి. అయితే ఒకరిద్దరు సిబ్బందిని కేటాయించినా వారు విధుల్లో తూతూమంత్రంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. వస్తువులు, పర్సులు పోగొట్టుకున్న ప్రయాణికులు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆరోపణలున్నాయి. పోలీసులు నిఘాను పెంచాల్సి ఉంది.
పోలీసుల పర్యవేక్షణ లోపం పనిచేయని సీసీ కెమెరాలు
ప్రయాణికులకు భద్రత కరువు ఇదీ బస్టాండ్లలో పరిస్థితి

కొరవడిన నిఘా