
నిద్రలోనే అనంతలోకాలకు..
● ట్రాక్టర్ తొక్కడంతో బాలుడి మృతి
● వాహన యజమాని టీడీపీ నాయకుడు
● కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నం
సోమశిల: నిద్రపోతున్న బాలుడిని ట్రాక్టర్ తొక్కడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన అనంతసాగరం మండలం పడమటికంభంపాడు గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి సమీపంలోనీ ఉత్తరకాలువ పక్కనుండే షెల్టర్‌లో మానికల శీనయ్య, చెంచమ్మ అనే గిరిజన కుటుంబం నివాసం ఉంటోంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడైన నాగరాజు (7) శనివారం రాత్రి షెల్టర్ వెనుక భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో తండ్రితోపాటు నిద్రించాడు. ఆదివా రం తెల్లవారుజామున ఓ వ్యక్తి ట్రాక్టర్‌ను కమ్మవారిపల్లి నుంచి తీసుకెళ్తూ నిద్రపోతున్న నాగరాజును తొక్కించడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాన్ని పీకే పాడు పెన్నానదిలో పూడ్చి పెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న సోమశిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● కాగా వాహన యజమాని టీడీపీకి చెందినవాడు. కేసు లేకుండా చేసేందుకు అతను తమ నేతల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.