
ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): చెత్త తరలించే వాహనాల బ్యాటరీలను దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు సంతపేట పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఇన్‌స్పెక్టర్ జి.దశరథరామారావు వివరాలు వెల్లడించారు. పాత మున్సిపల్ కార్యాలయంలో చెత్త తరలించే వాహనాలను పార్క్ చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తేదీన గుర్తుతెలియని దుండగులు 17 వాహనాల బ్యాటరీలను అపహరించారు. ఇంజినీరింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు రంగనాయకులపేట రిక్షా కాలనీ ఆనకట్ట రోడ్డుకు చెందిన షేక్ షఫీ, నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం టిడ్కో ఇళ్లలో ఉండే దాసరి అప్పారావుగా గుర్తించారు. గురువారం రాత్రి పుత్తా ఎస్టేట్ వద్ద వారిని అరెస్ట్ చేశారు. రూ.81 వేల విలువ చేసే 17 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్‌లో ప్రతిభ చూపిన దశరథరామారావు, ఎస్సై సుల్తాన్‌బాషా, సిబ్బంది సుబ్బారావు, లావణ్యకుమార్, గోపీ, సురేంద్ర, అల్లాభక్షును ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అభినందించారు.
మోకాళ్లపై కూర్చొని
కార్మికుల నిరసన
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థలో కా ర్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పజెబుతూ టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ చేస్తున్న సమ్మె పదో రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికులు శుక్రవారం నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్‌లో మోకాళ్లపై కూర్చొని ‘మా కడుపులు కొట్టొద్దు.. పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పొద్దు’ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నెల్లూరు రూరల్ ఉపాధ్యక్షుడు కొండా ప్రసాద్ మాట్లాడారు. మంత్రి నారాయణ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా కార్మికుల పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం ప్రభుత్వ విధానమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన విధానంతో తాను చేసేది ఏమీ లేదని చెప్పారన్నారు. కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపే విధానాలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కామాక్షమ్మ, సుజాతమ్మ, చంద్రమ్మ, భాగ్యమ్మ, కొండమ్మ, వజ్రమ్మ, భారతి, లోకేశ్, మనోజ్, శివ తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికులను కాపాడి..
● గుండెపోటుతో స్టీరింగ్‌పై
కుప్పకూలి డ్రైవర్ మృతి
రాయచోటి టౌన్/కావలి(జలదంకి): బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేసి ప్రయాణికులను ప్రమాదం నుంచి తప్పించి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రసూల్ సాహెబ్ (52)ది నెల్లూరు జిల్లాలోని కావలి. స్థానిక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నడుపుకొంటూ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయానికి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే సమయంలో మార్గమధ్యలో మదనపల్లె రోడ్డు సమీపంలో అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడం ఆరంభమైంది. అప్రమత్తమైన రసూల్.. వెంటనే రాయచోటి పట్టణం సమీపంలోని ఓ డివైడర్‌కు బస్సు తగిలించి ఆపేశాడు. అనంతరం స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో కండక్టర్, మరో నలుగురికి ప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్థానికుల సహకారంతో పోలీసులకు తెలియజేయడంతో ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి తన సిబ్బందితో వచ్చి డ్రైవర్ సీట్‌లో ఉన్న మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్ట్

ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్ట్