
దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని నిరసన
● బాధితుడిని లాక్కెళ్లిన పోలీసులు
సీతారామపురం: పరిహారం చెల్లించకుండానే దౌర్జన్యంగా తన భూమిలో రోడ్డు పనులు చేపట్టారని మండలంలోని గుండుపల్లికి చెందిన మామిడి భాస్కర్ అనే వ్యక్తి వాపోయాడు. అతను శుక్రవారం గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపి మాట్లాడుతూ తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో 50 సెంట్లు హైవేకు పోతుందన్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు బలగాలను దింపి నేషనల్ హైవే పనులను చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ అతని దాయాదులు కోర్టును ఆశ్రయించడంతో నష్టపరిహారం చెల్లించేందుకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణ పనులు చేయించడం జరిగిందన్నారు. కాగా ఒకానొక దశలో పరిస్థితి చేయి దాటిపోవడంతో భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.