
రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నెల్లూరు సిటీ: రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ వీరపాండ్యన్ గురువారం అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరులోని ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, రిజిస్ట్రార్‌లు విజయరాణి, సింహాద్రినాయుడు, స్టోన్‌హౌస్‌పేట సబ్ రిజిస్ట్రార్ సుమలతారెడ్డి, బుజబుజనెల్లూరు సబ రిజి స్ట్రార్ ప్రవీణదేవీ, ఇందుకూరుపేట సబ్ రిజిస్ట్రార్ భానుమతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఐజీ మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి ప్రభుత్వం అర్బన్ ఆటో మ్యూటేషన్ విధానాన్ని ప్రారంభంకానున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో భూ యజమానులు అసెస్‌మెంట్ నంబర్ కోసం మున్సిపల్ ఆఫీసుల్లో ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే ప్రక్రియ జరుగనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలకు రావాల్సిన పన్నులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆటోమేటిక్ విధానం ద్వారా జరుగుతాయన్నారు. సబ్ రిజి స్ట్రార్లు తమ ప్రాంతాల్లో త్వరితగతిన అసెస్‌మెంట్ చేయాలని ఆదేశించారు.