
సమస్యల్ని విన్నవిస్తామయ్యా..
● రైతులకు అనుమతి నిరాకరణ
నెల్లూరు(పొగతోట): బలవంతపు భూసేకరణ ఆపాలని ఉలవపాడు మండలం కరేడు గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జీఓ నంబర్ 43ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఆర్‌సీ సమావేశంలో మంత్రులను కలిసేందుకు రైతులను పోలీసులు అనుమతించలేదు. సమస్యను విన్నవించుకుంటామని ప్రాధేయపడినా కనికరించలేదు. సుమారు 4 గంటలపాటు రైతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా కరేడు భూ సేకరణ వ్యతిరేక కమిటీ నాయకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ పరిశ్రమల కోసం జిల్లా వ్యాప్తంగా 52 వేల ఎకరాలను భూసేకరణ చేయడం జరిగిందన్నారు. వాటిలో పదివేల ఎకరాల్లో పరిశ్రమ స్థాపించారని తెలిపారు. మిగిలిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కరేడు రైతులకు అన్యాయం జరిగేలా భూ సేకరణ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ అధ్యక్షుడు సునీల్, కరేడు గ్రామ రైతులు బొమ్మిరెడ్డి పవన్‌రెడ్డి, సీతారామ్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూములు తీసుకోవద్దు
సైదాపురం: పేదలు సాగు చేసుకుంటున్న భూములు తీసుకోవద్దని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య అన్నారు. ఆ సంఘం నేతలు గిరిజనులతో కలిసి బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన తహసీల్దార్ గిరిజనుల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా తాము కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకెళ్లడంతో విరమించారని గుర్తుచేశారు. మళ్లీ ఆ భూములను స్వాధీనం చేసుకునే చర్యలు ఆపాలని కోరారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెంచు మల్లికార్జున, మహిళా విభాగం అధ్యక్షురాలు చెంబేటి ఉష, నేతలు మల్లి, నాగరాజు, కోలా రమేష్, ఏకోలు శ్రీనివాసులు, అనంతయ్య, వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఏకోలు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.