
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నెల్లూరులోని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. భగత్‌సింగ్ కాలనీకి చెందిన పూడి వంశీకృష్ణ (26), కిసాన్ నగర్‌కు చెందిన మల్లు సుధీర్ స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసై నిత్యం మద్యం తాగుతుండేవారు. ఇటీవల వారి మధ్య విభేదాలు నెలకొన్నాయి. సుధీర్ ఇంట్లో లేని సమయంలో వంశీకృష్ణ వెళ్లి వస్తువులను ధ్వంసం చేశాడు. కక్ష పెంచుకున్న సుధీర్ ఎలాగైనా స్నేహితుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి వంశీ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకుని వెళ్లాడు. అతను నిద్రపోతుండగా సుధీర్ నీళ్ల మోటార్‌తో ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత ఆధారంగా మంగళవారం సాయంత్రం ప్రశాంతినగర్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసును త్వరితగతిన చేధించి నిందితుడిని అరెస్ట్ చేసిన వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సైలు రెహమాన్, శివయ్య, సిబ్బంది ఎస్.ప్రసాద్, ఆర్వీ రత్నయ్య, ఎం.వేణు, జి.మస్తానయ్య, షేక్ గౌస్‌బాషాను ఏఎస్పీ సౌజన్య అభినందించారు.